క్రిస్మస్ స్పెషల్.. మిల్లెట్స్ తో టేస్టీ రెసిపీలు.. ఒక్కసారి ట్రై చెయ్యండి

 క్రిస్మస్ స్పెషల్.. మిల్లెట్స్ తో  టేస్టీ రెసిపీలు.. ఒక్కసారి ట్రై చెయ్యండి

కేక్స్​లో చాకొలెట్, వెనీలా, ఆరెంజ్, ఆపిల్, బనానా, డ్రైఫ్రూట్స్​.. ఇలా ఎన్నో రకాలున్నాయి. అవన్నీ టేస్ట్ చేసే ఉంటారు. సో, కొత్త టేస్ట్​ ట్రై చేయాలనుకున్నా, హెల్దీగా కేక్ తినాలనుకునే వాళ్లకోసం ఈ రెసిపీలు.  క్రిస్మస్ సందర్భంగా మిల్లెట్స్​తో కేక్స్, బ్రెడ్, కుకీస్​ వంటి హెల్దీ అండ్ టేస్టీ స్పెషల్స్​ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. 

మిల్లెట్ చాకొలెట్ కేక్


కావాల్సినవి:
రాగి పిండి: ముప్పావు కప్పు, పెరుగు, గోధుమ పిండి, వెన్న: ఒక్కోటి అర కప్పు, నూనె, చక్కెర పాకం, ఉప్పు: సరిపడా, బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్, వెనీలా ఎసెన్స్​: ఒక టీస్పూన్, బెల్లం: ఒక కప్పు, కోకో పౌడర్: మూడు టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా: అర టీస్పూన్

క్రీమ్ కోసం:
చక్కెర పొడి: రెండు కప్పులు, కోకో పౌడర్: అర కప్పు, వెనీలా ఎసెన్స్: 
ఒక టీస్పూన్, 
పాలు: పావు కప్పు

తయారీ : ఒక గిన్నెలో పెరుగు, కరిగించిన బెల్లం, నూనె, వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్​ చేయాలి. మరో గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి, కోకోపౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలిపి జల్లెడ పట్టాలి. ఆ పిండిని కూడా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తర్వాత బేకింగ్​ కోసం ఒక పాత్రలో వేయాలి. పాన్​లో ఉప్పు వేసి వేడి చేసి అందులో ఒక స్టాండ్ పెట్టి దానిపై కేక్​ మిశ్రమం వేసిన పాత్ర పెట్టాలి. మూత పెట్టి అరగంట సేపు ఉడికించాలి. వెన్నని విస్కర్ సాయంతో బాగా బీట్ చేసి, తర్వాత అందులో కోకోపౌడర్, వెనీలా ఎసెన్స్ వేసి పాలు పోసి మళ్లీ కలపాలి. ఆపై చక్కెర పొడి వేసి పాలు పోస్తూ బాగా కలపాలి. కేక్‌ మీద ఈ రెండు మిశ్రమాలను ఒకదాని తర్వాత ఒకటి పూయాలి. చివరిగా చాకొలెట్​లు కూడా పెట్టి డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది.

జింజర్ బ్రెడ్​ మిల్లెట్​ కుకీస్

తయారీ : ఒక గిన్నెలో జొన్నపిండి, రాగిపిండి, బియ్యప్పిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టాలి. తర్వాత  పిండిలో దాల్చిన చెక్కపొడి, లవంగం పొడి, జాజికాయ పొడి, ఎడిబుల్ గమ్ పొడి, అల్లం పొడి, బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. అల్లాన్ని సన్నగా తరిగి అందులో వేయాలి. దాంతోపాటు వెన్న కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే నీళ్లు పోసి ముద్దగా చేయాలి. దాన్ని కవర్​లో ప్యాక్ చేసి ఫ్రిజ్​లో అయితే గంట, డీప్ ఫ్రిజ్​లో 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కవర్​ తీసేసి చిన్న ఉండలు చేయాలి. వాటిని చపాతీలా చేసి మౌల్డ్స్​తో నచ్చిన షేప్​లో వత్తాలి. బేకింగ్​ ట్రేలో బటర్​పేపర్​ వేసి దానిపై కుకీస్​​ని పేర్చాలి. తర్వాత ఒవెన్​లో పెట్టి 350 డిగ్రీస్‌ టెంపరేచర్​లో 15 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి తింటే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి.

కావాల్సినవి :

జొన్నపిండి: ఒక కప్పు
చక్కెర లేదా బ్రౌన్ షుగర్, వెన్న: ఒక్కోటి అర కప్పు
రాగిపిండి, బియ్యప్పిండి: ఒక్కోటి పావు కప్పు
అల్లం పొడి: అర టేబుల్ స్పూన్
ఎడిబుల్ గమ్ పొడి, దాల్చినచెక్క పొడి: 
ఒక్కో టీస్పూన్
లవంగం పొడి: 
ముప్పావు టీస్పూన్
జాజికాయ పొడి: అర టీస్పూన్
ఉప్పు, బేకింగ్​ సోడా: 
ఒక్కోటి పావు టీస్పూన్
అల్లం: చిన్న ముక్క

మిల్లెట్ మావా కేక్

తయారీ : ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన, వెన్న, చక్కెర పొడి వేసి విస్కర్​తో బాగా బీట్ చేయాలి. తర్వాత మావా వేసి మరోసారి కలపాలి. కొర్ర పిండి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ కలిపి జల్లెడ పట్టాలి. ఆ పిండిని తయారుచేసుకున్న మిశ్రమంలో వేసి కలపాలి. ఆ తర్వాత అందులో పాలు, వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఒవెన్​లో పెట్టి 180 డిగ్రీల టెంపరేచర్​లో 45 నిమిషాల పాటు ఉడికించాలి. చల్లారాక ముక్కలుగా కట్ ​చేసుకోవాలి. 

కావాల్సినవి :

కొర్ర పిండి, వెన్న: ఒక్కో కప్పు, మావా, పాలు: ఒక్కోటి పావు కప్పు, కోడిగుడ్లు: మూడు, బేకింగ్ పౌడర్: అర టీస్పూన్, చక్కెర పొడి: ఒకటింబావు కప్పు, యాలకుల పొడి: ముప్పావు టీస్పూన్
వెనీలా ఎసెన్స్: ఒక టీస్పూన్