- మరొకరితో కలిసి అఘాయిత్యం
- పాడెపై నుంచి పోస్టుమార్టం కోసం డెడ్ బాడీ తరలింపు
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేటలో ఘటన
ఎల్లారెడ్డిపేట, వెలుగు : భర్తకు ఉరేసి చంపి.. గుండెపోటుతో చనిపోయాడని భార్య నమ్మించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. దహనసంస్కారాలకు పాడె మీద తీసుకెళ్తుండగా అసలు విషయం తెలిసింది. పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58), కొన్నేండ్ల కింద ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.
తన కొడుకును కూడా తీసుకెళ్లాడు. నెలకింద ఇద్దరూ ఇంటికి వచ్చారు. తన కొడుకు పెండ్లి చేశాడు. శుక్రవారం నర్సయ్య పొలానికి వెళ్లగా.. కొడుకు, కోడలు ఆస్పత్రికి సిరిసిల్లకు వెళ్లారు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి రాగా.. ఆ సమయంలో భార్య వజ్రవ్వ కంచర్లకు చెందిన మరో వ్యక్తితో కలిసి ఉండడంతో నిలదీశాడు.
దీంతో ఇద్దరూ కలిసి దూలానికి ఉరేసి హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో చనిపోయినట్లు వజ్రవ్వ బంధువులకు, గ్రామస్తులకు తెలిపి నమ్మించింది. శనివారం అంత్యక్రియలకు చేసేందుకు శవాన్ని పాడెపై తీసుకెళ్తుండగా నర్సయ్య మెడ నల్లగా మారి గాయాలతో కనిపించింది.
దీంతో బంధువులు, గ్రామస్తులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. నర్సయ్య భార్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. భర్తను ఉరేసి చంపేసి గుండెపోటుతో చనిపోయినట్టు వజ్రవ్వ చిత్రీకరించిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు.
