- మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో బయటపడిన వైనం
గొల్లపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లికార్జునస్వామి ఆలయ హుండీని శనివారం లెక్కించగా ఆసక్తికర విషయం వెలుగుచూసింది. హుండీలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నమూనా బ్యాలెట్ పేపర్ బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సట్టేడు వారాల మల్లికార్జునస్వామి జాతర జరిగింది.
ఆ సమయంలో పంచాయతీ ఎన్నికలు ఉండగా.. గెలవాలని కోరుకుంటూ దమ్మన్నపేట సర్పంచ్ అభ్యర్థి ముదాం గౌతమి, 3వ వార్డు మెంబర్ బంగుడపు రవీందర్ నమూనా బ్యాలెట్ పేపర్ స్వామి హుండీలో వేసి మొక్కుకున్నారు. జాతర ముగియడంతో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేస్తుండగా నమూనా బ్యాలెట్ పేపర్ కనిపించింది. కాగా.. ఎన్నికల్లో ఇరువురు అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం.
