- ప్రభుత్వం స్పందించకుంటే నిరాహారదీక్ష చేస్తా : కవిత
హైదరాబాద్, వెలుగు: మానసిక ఎదుగుదల లేని పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని, వారి తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం నెల రోజుల్లోగా స్పందించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానన్నారు. బోయిన్ పల్లి మనో వికాస్ నగర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (ఎన్ఐఈపీఐడీ) లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో కవిత శనివారం జాగృతి ఆఫీసులో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘మానసిక ఎదుగుదల తక్కువ ఉన్నపిల్లల తల్లితండ్రుల బాధలు నాకు తెలుసు. వారికి ఇండ్లు కూడా అద్దెకు దొరకవు. అందుకే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. వారికి పెన్షన్ కూడా ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్న వారు లక్ష మంది వరకు ఉంటారు. ఇందు కోసం నా వంతుగా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తా. ముందుగా ప్రభుత్వానికి లేఖలు రాసి ఒక నెల సమయం ఇద్దాం. నెల రోజుల్లో స్పందించకపోతే మాత్రం కచ్చితంగా నేనే నిరాహార దీక్ష చేస్తా” అని కవిత పేర్కొన్నారు.
