కొడుకు అవయవాల కోసం కోర్టుకెక్కిన తల్లి...48 ఏండ్ల తర్వాత తీర్పు

కొడుకు అవయవాల కోసం కోర్టుకెక్కిన తల్లి...48 ఏండ్ల తర్వాత తీర్పు

ఎడిన్​బరో:  పొత్తిళ్లలో కొడుకు అరుదైన వ్యాధితో చనిపోగా తల్లికి చెప్పకుండా ఆస్పత్రి సిబ్బంది బాడీని తీసుకెళ్లారు.. పరిశోధనల కోసం అవయవాలను సేకరించారు.. పోస్ట్​ మార్టం పూర్తయ్యాక పసికందును సమాధి చేసినట్లు ఆ తల్లిని నమ్మించారు. అయితే, సమాధిలో పసికందు అవశేషాలు లేవని తెలియడంతో ఆస్పత్రిపై కోర్టుకెక్కిందా తల్లి.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా వెనక్కి తగ్గలే.. తనకు క్యాన్సర్ సోకినా పోరాటం ఆపలే. దాదాపు ఐదు దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేసిందా తల్లి. చివరకు కోర్టు తీర్పుతో 48 ఏండ్ల తర్వాత తన కొడుకు అవయవాలను అందుకుంది. వాటికి సంప్రదాయం ప్రకారం శనివారం అంత్యక్రియలు పూర్తిచేస్తానని తెలిపింది. స్కాట్లాండ్​లో చోటుచేసుకుందీ ఘటన!

ఏండ్ల తరబడి పోరాటం..

ఎడిన్​బరోకు చెందిన లిడియా రీడ్(74)కు 1975లో కొడుకు పుట్టాడు. రీసస్ అనే అరుదైన వ్యాధితో వారంరోజుల్లోనే చనిపోయాడు. కొడుకును చివరిసారిగా చూసుకుంటానని అడిగిన లిడియాకు వేరే శిశువు​ బాడీ చూపించారు. పిల్లాడిని ఖననం చేసే చోట కూడా ఎలాంటి అవశేషాలు దొరకలేదు. దీంతో తన అనుమతి లేకుండానే తన కొడుకు ఆర్గాన్స్​ను సేకరించారని ఆస్పత్రిపై లిడియా కోర్టుకెక్కింది. అవయవ దోపిడీపై ఏండ్ల తరబడి ప్రచారం చేసింది. పేగు క్యాన్సర్  బాధపడుతున్నా సరే ఆస్పత్రిపై పోరాటం ఆపలేదు. 2017లో కోర్టు ఆదేశాలతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎడిన్​బరోలోని రాయల్ ఇన్​ఫర్మరీ ల్యాబ్​లో లిడియాకొడుకు అవయవాలు భద్రపరిచినట్లు తెలిసింది. లివర్ పూల్​లోని ఆల్డర్ హే ఆస్పత్రిని కోర్టు దోషిగా తేల్చింది. కోర్టు ఆదేశాలతో ల్యాబ్ అధికారులు.. ఆ ఆర్గాన్లను లిడియాకు శుక్రవారం అప్పగించారు.