సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 49 క్రాకర్ బర్న్ కేసులు

సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 49  క్రాకర్ బర్న్ కేసులు
  • పటాకులతో కండ్లకు గాయాలు 
  • సరోజినీ హాస్పిటల్​కు 49 మంది.. నలుగురికి సర్జరీ​
  • ఉస్మానియా ఆస్పత్రిలో మరో 18 మందికి ట్రీట్​మెంట్​

మెహిదీపట్నం,వెలుగు: దీపావళి రోజున పటాకులు పేలుస్తూ గాయపడిన 67 మంది ఉస్మానియా, సరోజినీ దేవి హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా సుమారు 49 మందికి ట్రీట్​మెంట్​ చేసినట్టు సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం తెలిపారు.  19 మందిని హాస్పిటల్​లో అడ్మిట్ చేశామన్నారు. మల్లెపల్లి ప్రాంతానికి చెందిన అజయ్ సింగ్ (25), యూసుఫ్​గూడ ఏరియాకు చెందిన విజయానంద్ (61), పురాణాపూల్​కు చెందిన మహావీర్ (15), హయత్ నగర్ కు చెందిన రాజీ(27) కండ్లలో నిప్పురవ్వలు పండి తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. వీరికి సర్జరీలు చేసినట్టు చెప్పారు. రెండు, మూడు సార్లు ఆపరేషన్లు చేస్తే గానీ చూపు వచ్చే పరిస్థితి లేదన్నారు.

కండ్లల్లో చిన్నపాటి నిప్పురవ్వలు పడిన వారికి ట్రీట్​మెంట్​ అందించి, ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సల కోసం రూ.50వేల చెక్కును మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత అందజేసినట్లు సూపరింటెండెంట్ రాజలింగం తెలిపారు. టపాసుల కారణంగా గాయపడిన వారికి ట్రీట్​మెంట్​ ఇచ్చామని ఉస్మానియా హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ నాగేందర్​ తెలిపారు. 17మంది ఔట్​ పేషంట్​కు వెళ్లగా, ఒక ఇన్​ పేషంట్​ కేసు నమోదైందని తెలిపారు.