కేసీఆర్ ఫ్యామిలీకి 5 ఉద్యోగాలు అవసరమా?

కేసీఆర్ ఫ్యామిలీకి 5 ఉద్యోగాలు అవసరమా?

వేములవాడ, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్​గడీల్లో బందీగా ఉన్న తెలంగాణను విడిపించాలని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ రాష్ర్ట అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పెద్ద దొర, చిన్న దొరకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ‘నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్‌‌కు కనిపించడం లేదా? ఆయన​ కుటుంబానికి ఐదు ఉద్యోగాలు అవసరమా..?’ అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం షర్మిల పర్యటించారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో జాబ్ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముచ్చర్ల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించి ఒక్కరోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగు రేట్లు పెరిగిందన్నారు. ఆనాడు ఉద్యమం కోసం 1,200 మంది చనిపోతే, ఇప్పుడు వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
దమ్ముంటే లక్షా 91 వేల ఉద్యోగాలు నింపాలె..
 రాజన్నరాజ్యంతోనే రాష్ట్రం బాగుపడుతుందని షర్మిల అన్నారు.  ‘ఆనాడు వైఎస్సార్ రైతులకు రుణమాఫీ చేశారు. ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. 108 అంబులెన్స్ సర్వీసులను ప్రవేశపెట్టింది ఆయనే. టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ, వడ్డీ మాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పెన్షన్ల కోసం వృద్ధుల పడిగాపులు.. మరోవైపు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులు ఎదురుచూపులు చూసున్నారు. చిన్న దొర,పెద్ద దొరకు దమ్ముంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి.- ఆడవాళ్లు ఉద్యమాలు చేస్తే చిన్న దొర కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కు ఎందుకంత నామూషీ.. చిన్న దొర జిల్లాకు వస్తున్నడంటే ప్రతిపక్ష నాయకులు, ప్రశ్నించే జర్నలిస్టులను అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఈ వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుంది..’ అని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఇందిరా శోభన్‌, ఏపూరి సోమన్న, వెంకట్ రెడ్డి, సత్యరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.