- కమర్షియల్ సిలిండర్ పై రూ.195 - 218 మధ్య పెరిగిన ధర
న్యూఢిల్లీ/బెంగళూరు: పశ్చిమాసియాలో యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. దేశంలో 19 కేజీల కమర్షియల్, 5 కేజీల మినీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ ధరను రూ.195 నుంచి రూ.218 వరకు పెంచగా, 5 కేజీల మినీ సిలిండర్ ధరను రూ.51 పెంచింది. ఈ పెంపుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,078, ముంబైలో రూ.2,031, కోల్‌కతా రూ.2,208, చెన్నై రూ.2,246 పెరిగాయి.
మార్చి 1న ఇదే కమర్షియల్ సిలిండర్‌పై రూ.114.5 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరోసారి భారీగా పెంచాయి. 2026 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే, గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు, ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను సవరించింది. ఎక్స్‌పీ100 పెట్రోల్ ధర లీటరుకు రూ.149 నుంచి రూ.160కి చేరింది. ఎక్స్‌ట్రా గ్రీన్ డీజిల్ ధర లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెరిగింది.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)
ఢిల్లీలో ఏటీఎఫ్ ధరలను మొదటగా కిలో లీటరుకు రూ.96,638.14 నుంచి రూ.2,07,341.22కు పెంచారు. ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే ఫస్ట్ టైం. అయితే, కొన్ని గంటల్లోనే కేంద్రం స్పందించి, దేశీయ విమానయాన సంస్థలకు ఫ్యూయల్ ధరను కిలోలీటరుకు రూ.1,04,927కు సవరించింది.
అలాగే, నయరా బాటలోనే మరో ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ ‘షెల్ ఇండియా’పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. బెంగళూరులో షెల్ ఇండియా సంస్థలో సాధారణ పెట్రోల్ లీటరుకు ధర రూ.119.85కి, పరవ్ వేరియంట్ ధర రూ.129.85కి చేరింది. డీజిల్ లీటరుకు రూ.25.01 పెరిగింది.
