వరి, పత్తి, పునాస పంటలు ఆగం

వరి, పత్తి, పునాస పంటలు ఆగం

హైదరాబాద్, వెలుగు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి, మక్క, సోయా, వరితో పాటు పునాస పంటలపై వర్షాల ప్రభావం పడింది. వర్ష విలయానికి రైతులు నష్టపోతున్నరు. ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. వరదకు కొట్టుకుపోతున్నాయి.

ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఈ సారి 40 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు జరిగింది. విత్తనాలు, మొలక స్థాయిలోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తకుండా వర్షాల వల్ల మురిగిపోతున్నాయి. మొలక వచ్చినవి కూడా పొలంలో నీరు నిలవడంతో చనిపోతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఈ సీజన్​లో ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అధికారుల సూచనల ప్రకారం రైతులు వెదజల్లే వరి సాగుకు మొగ్గు చూపారు. వానలకు వరి విత్తనాలు మురిగిపోయి మొలకలు రావడం లేదు. ఫలితంగా మళ్లీ విత్తనాలు వేయడమో, నారు పోసుకుని నాట్లు వేయడమో చేయాల్సిన పరిస్థితి.