ఆందోళనలో 5 లక్షల మంది డిగ్రీ, పీజీ అభ్యర్థులు 

ఆందోళనలో 5 లక్షల మంది డిగ్రీ, పీజీ అభ్యర్థులు 
  • నోటిఫికేషన్ల టైమ్​లో..  డిస్టెన్స్​ స్టడీపై వేటు
  • ఆందోళనలో 5 లక్షల మంది డిగ్రీ, పీజీ అభ్యర్థులు 
  • యూజీసీ అనుమతి ఉన్నా ఇతర రాష్ట్ర వర్సిటీల డిస్టెన్స్ సర్టిఫికెట్లు చెల్లవంటున్న సర్కారు
  • 2024 వరకైనా అనుమతించాలని కోరుతున్న అభ్యర్థులు
  • డబ్బులు, టైం వృథా అయ్యాక ఇప్పుడు చర్యలేంటని ఆగ్రహం
  • యూజీసీ అనుమతి ఉన్నా ఇతర రాష్ట్ర వర్సిటీల డిస్టెన్స్ సర్టిఫికెట్లు చెల్లవంటున్న సర్కారు
  • ఏడేండ్లుగా స్టడీ సెంటర్లను మూసివేయకుండా నిర్లక్ష్యం
  • 2024 వరకైనా అనుమతించాలని కోరుతున్న అభ్యర్థులు
  • డబ్బులు, టైమ్​ వృథా అయ్యేదాక చూసి ఇప్పుడు చర్యలేంటని ఆగ్రహం
  • ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉన్నా.. యూజీసీ రూల్​అమలుపై అభ్యంతరం


హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న సుమారు 5 లక్షల మంది అభ్యర్థులకు రాష్ట్ర సర్కారు షాకిచ్చింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వంటి పలు సంస్థల డిస్టెన్స్ స్టడీ సెంటర్లలో చదివిన వారి సర్టిఫికెట్లు చెల్లవని చెబుతోంది. దీంతో ఆయా వర్సిటీల్లో డిగ్రీలు, పీజీలు చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చెల్లినవి ఇప్పుడెందుకు చెల్లవని, యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్​కమిషన్) అనుమతి ఉన్న వర్సిటీల సర్టిఫికెట్లపై అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్లు వస్తుండడం, అందులో ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటుకావంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం అభ్యర్థుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. 

‘డిస్టెన్స్’లో చేసేవాళ్లంతా పేద స్టూడెంట్సే

జాబులు చేస్తున్న వాళ్లు, పెండ్లీలు అయిన మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వారు డైరెక్టుగా కాలేజీల్లో, వర్సిటీల్లో చేరి ఉన్నత విద్యను పూర్తి చేయలేక ఆయా వర్సిటీలు నిర్వహించే స్టడీ సెంటర్లలో చేరి ఇంటి దగ్గరే చదువుకుని కోర్సులు పూర్తి చేస్తుంటారు. అలాంటి వాళ్లు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఆయా వర్సిటీల్లో ఫీజులు తక్కువుండడంతో వాటివైపు మొగ్గు చూపుతుంటారు. మన రాష్ట్రంలో ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లు 100కుపైనే ఉన్నాయి. వీటిల్లో యేటా వేలాది మంది చేరి కోర్సులు పూర్తి చేస్తున్నారు. అలా పొందిన సర్టిఫికెట్లు చెల్లవని అధికారులు చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎందుకు చెల్లవంటున్నారంటే?

యూజీసీ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర పరిధిలోని వర్సిటీ ఆ రాష్ట్ర పరిధిలోనే స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు ఇస్తే చెల్లుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు జారీ చేస్తే చెల్లవని చెబుతున్నారు. 2014కు ముందు నాగార్జున వర్సిటీలో చదివిన వారి సర్టిఫికెట్లు చెల్లుతాయని, కానీ ఆ తర్వాత కోర్సులు చేసిన వారివి చెల్లవని చెబుతున్నారు. ఇక్కడి స్టడీ సెంటర్ల ద్వారా కోర్సుల్లో చేరినా పరీక్షలు మాత్రం ఏపీలో రాస్తే చెల్లుతాయని అంటున్నారు. అయితే కేవలం పరీక్ష రాసిన ఎగ్జామ్​ సెంటర్​ ఉన్న ప్రాంతాన్ని ప్రమాణికంగా తీసుకుని సర్టిఫికెట్లు చెల్లవని ఎలా చెబుతారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.  

ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలే..

రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ స్టడీ సెంటర్లపై విద్యార్థి సంఘాల నేతలు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​కు అనేక ఫిర్యాదులు చేశారు. వేల మందిని చేర్చుకుంటున్నారని,  పరీక్షల నిర్వహిస్తున్నారని చెప్పినా పట్టించుకోలేదు. ఇతర వర్సిటీ స్టడీ సెంటర్ల సర్టిఫికెట్లు చెల్లవనే ప్రకటనలు ఇవ్వకపోగా, వాటిని నిర్వహిస్తున్న కాలేజీలపైనా చర్యలు తీసుకోలేదు. దీంతో అనేక డిస్టెన్స్ స్టడీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. అయితే 2020లో ఓయూ స్టడీ సెంటర్లు నిర్వహించే కాలేజీలకు రూ.5 లక్షల ఫైన్ వేస్తామని, అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. అయినా చాలా కాలేజీల్లో స్టడీ సెంటర్లు, ఎగ్జామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది 4కాలేజీలకు లక్ష చొప్పున ఫైన్ వేశారు. 

2024  వరకు అనుమతించాలి

రాష్ట్రానికి చెందిన అనేక మంది 2014 వరకు డిస్టెన్స్ లోనే చదువుకున్నారని, అదే కొనసాగింపుగా తాము కూడా కోర్సులు పూర్తి చేశామని అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక యూజీసీ రూల్​అమలులోకి వచ్చిందని, ఆయా వర్సిటీల్లో రాష్ట్ర అభ్యర్థులు చదవొద్దని అధికారులు ప్రచారం చేస్తే బాగుండేదని అంటున్నారు. ఆ విషయం తెలియకనే వాటిల్లో  చేరామని, తీరా కోర్సులు పూర్తయ్యాక, నోటిఫికేషన్లు వస్తున్న టైమ్ లో యూజీసీ రూల్​ను తెరపైకి తెచ్చి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయినా ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ విషయాన్ని  పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికీ ఎంసెట్​లో ఏపీ స్టూడెంట్స్​కు కోటా ఇస్తున్నారని, వరంగల్​ నిట్​లోనూ గత ఏడాది వరకు రాష్ట్ర కోటా నుంచి సగం సీట్లను ఏపీ స్టూడెంట్స్​కు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2024 వరకైనా ఆయా వర్సిటీల్లో చదివిన వారి సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. కేవలం 2015 నుంచి 2022 వరకు చదివిన వారికి వెసులుబాటు ఇస్తే సరిపోతుందని, ఇతర రాష్ట్ర వర్సిటీలను కట్టడి చేసే ప్రయత్నంలో సొంత రాష్ట్ర స్టూడెంట్స్​ నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెబుతున్నారు.

రాష్ట్ర అభ్యర్థులకు అన్యాయం చేస్తరా?

యూజీసీ గుర్తింపు ఉన్న నాగార్జున వర్సిటీతోపాటు పలు యూనివర్సిటీల్లో డిస్టెన్స్​లో చదివిన స్టూడెంట్లకు న్యాయం చేయాలి. డిస్టెన్స్ సర్టిఫికెట్లు చెల్ల వని గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు చెప్పినా, గు ట్టుచప్పుడు కాకుండానే ప్రైవేటు కాలేజీలు స్టడీ సెంటర్లు నిర్వహించాయి. 2024 వరకైనా డిస్టెన్స్ స్టడీ సెంటర్లలో చదివిన స్టూడెంట్లకు చాన్స్​ ఇవ్వాలి.

ఎం. ప్రేమ్ కుమార్, విద్యార్థి సంఘం నాయకులు

యూజీసీ నిబంధనల ప్రకారమే యూజీసీ నిబంధనల ప్రకారమే డిగ్రీల వాలిడిటీ ఉంటుంది. అందులో కౌన్సిల్ పాత్ర ఏమీ ఉండదు. ఆయా వర్సిటీల పరిధి మేరకు నిర్వహణ, వాలిడిటీ అమలులో ఉంది. 
- ప్రొఫెసర్ లింబాద్రి, 
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్