లారీని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

V6 Velugu Posted on Aug 12, 2021

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్, ఒక చిన్నారి పాప మాత్రం గాయాలతో బయటపడ్డారు.

గురువారం ఉదయం కారులో ఒక ఫ్యామిలీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి జార్ఖండ్‌కు బయలుదేరింది. బస్తీ జిల్లాలో హైవేపై పురైనా క్రాసింగ్ దగ్గరకు రాగానే కారు ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్లి రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ లారీని ఢీకొట్టింది. దీంతో కారు దానికి కిందికి వెళ్లి తుక్కుతుక్కు అయింది. ఆ సమయంలో కారులో ఏడుగురు ఉండగా ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని కల్వరి సర్కిల్ ఆఫీసర్ అలోక్ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందగానే అక్కడికి చేరుకుని క్రేన్ సాయంతో కారును బయటకు తీసినట్లు చెప్పారు. ఒక చిన్న పాప, డ్రైవర్ గాయాలతో బయటపడ్డారన్నారు. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని, ఆ పాపకు మాత్రం ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

Tagged car, UP, family, Lorry

Latest Videos

Subscribe Now

More News