
నైరోబీ: కెన్యాలో ఓ పాస్టర్ మాట విని కొంతమంది జనం కావాలనే ఆకలి చావులు చస్తున్నరు. చనిపోయే దాకా ఉపాసం ఉంటే.. జీసస్ వద్దకు వెళ్తారంటూ అతను చెప్పిన మాటలను నమ్మిన కొందరు ఆకలితో మాడి బలైపోయారు. ఇప్పటివరకూ ఇలా 47 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 112 మంది అడవిలో దాక్కున్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కెన్యాలోని కిలిఫీ కౌంటీ, షకహోలా ఏరియాలో ఓ చర్చిని నడుపుతున్న పాల్ మెకంజీ అనే పాస్టర్ దీనికంతటికీ కారణమని, అతనిని అరెస్ట్ చేశామన్నారు.
పాస్టర్ మాట విని ఉపాసంతో జనం చనిపోతున్న విషయాన్ని వారం రోజుల క్రితం గుర్తించామని తెలిపారు. చర్చి సమీపంలోని అడవిలో పాతిపెట్టిన మృతదేహాలను వెలికితీశామని, సోమవారం నాటికి మొత్తం 47 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చర్చి సమీపంలో 800 ఎకరాల అడవి ఉందని, అందులో మరింత మంది దాక్కుని ఉపాసం చేస్తూ ఉండొచ్చని, వారి కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. కొంత మందిని కాపాడి ఆస్పత్రిలో చేర్చినా ట్రీట్ మెంట్కు సహకరించడంలేదని పేర్కొన్నారు.
ఆ పాస్టర్ ఒక టెర్రరిస్ట్: కెన్యా ప్రెసిడెంట్
దేవుడి పేరుతో తప్పుడు ప్రచారంచేస్తూ ఫాలోవర్లను బలి తీసుకుంటున్న మెకంజీ ఒక టెర్రరిస్ట్ అని కెన్యా ప్రెసిడెంట్ విలియం రూటో మండిపడ్డారు.