స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ.. 50 మంది పేర్లు బయటకి!

స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ.. 50 మంది పేర్లు బయటకి!

బెర్నే/న్యూఢిల్లీస్విట్జర్లాండ్ బ్యాంకుల్లో పోగైన ‘బ్లాక్ మనీ’ని ఇండియాకు రప్పించడంలో ముందడుగు పడింది. అక్కడ అక్రమ సంపదను దాచుకున్న నల్ల కుబేరులపై చర్యలు తీసుకునేందుకు ఇండియా, స్విస్ ప్రభుత్వాలు ఉచ్చు బిగిస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీని దాచుకున్న సుమారు 50 మంది ఇండియన్ల వివరాలను అందజేసే ప్రక్రియను ఆ దేశ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు స్విస్ గవర్నమెంట్ ఫెడరల్ గెజిట్​లో పేర్కొన్న పేర్లు బహిర్గతమయ్యాయి. కొన్ని పేర్లు పూర్తిగా బయటికి రాగా, మరికొన్ని ఇనిషియల్స్ మాత్రమే బయటపడ్డాయి. ఈ 50 మంది కార్యకలాపాలు, కంపెనీలు కేరళ, గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో ఉన్నాయి. హెచ్ఎస్​బీసీ, పనామా పేపర్లలో పేర్కొన్న పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. రియల్​ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ, టెలికాం, హెమ్ డెకరేషన్, టెక్స్​టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాలు, ఆభరణాలు.. తదిరత రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఈ జాబితాలో ఉన్నట్లు ‘మ్యూచువల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్’ ప్రాసెస్​లో పాల్గొన్న ఇరుదేశాల అధికారులు చెప్పారు.

ఇప్పటికే నోటీసులు జారీ

గెజిట్​లో పేర్కొన్న 50 మంది ఇండియన్లకు స్విస్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఇండియన్ అథారిటీలతో వారి సమాచారాన్ని పంచుకునే అంశంపై అప్పీల్ చేసేందుకు చివరి అవకాశం కల్పించారు. తమ సమాచారాన్ని పంచుకునేందుకు వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. అంతకుముందు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కొందరు క్లయింట్లు దాఖలు చేసిన ప్రిలిమినరీ అప్పీళ్లను స్విస్ ప్రభుత్వం తిరస్కరించింది. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్లు అసమగ్రంగా ఉన్నాయన్న కారణంతో వాటిని రిజెక్ట్ చేసింది. సందేహాస్పదమైన రికార్డులు ఉన్న, డిపాజిట్ చేసిన డబ్బు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్న క్లయింట్ల వివరాలను పంచుకునే ప్రక్రియ.. కొన్ని నెలలుగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

100 మంది వివరాలు ఇప్పటికే అందజేత

గత ఏడాది కాలంగా సుమారు 100 మంది ఇండియన్ల వివరాలను భారత ప్రభుత్వానికి స్విస్ అందజేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసులన్నీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అందులో చాలా కేసులకు రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ కూడా అందజేస్తామని వివరించారు.

అప్పీలుకు అవకాశం

స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న క్లయింట్లకు అక్కడి చట్టాలు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఆర్థిక అవకతవకలు జరిగాయని ఏదైనా ప్రూఫ్ చూపించి క్లయింట్ల సమాచారం ఇవ్వాలని దేశాలు కోరితే.. దీనిపై సదరు వ్యక్తులు 30 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చు. కొన్ని కేసుల్లో అయితే 10 రోజుల్లోగా అప్పీలు చేసుకోవాలి. అప్పీలులో పేర్కొన్న సమాచారం, ఇచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా.. క్లయింట్ కు సంబంధించిన సమాచారం పంచుకోవాలా, వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారు.

రెండు దేశాల సమన్వయంతో..

నల్లధనం దాచుకునే వారికి స్విట్జర్లాండ్ ‘భూతల స్వర్గం’ అన్ని అపవాదును తొలగించుకునేందుకు ఆ దేశం కొన్నేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తోంది. స్విస్ బ్యాంకుల క్లయింట్లు ఆర్థిక అవకతవకలు చేశారంటూ ఆధారాలు చూపిన దేశాలతో సదరు వ్యక్తుల సమాచారాన్ని పంచుకుంటోంది. మరోవైపు 2014లో ఏర్పాటైన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీని వెనక్కి రప్పిస్తామని చెప్పింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం రూపొందించుకున్న ఫ్రేమ్​వర్క్ ను ఇరు దేశాలు మరింత పటిష్టం చేశాయి. అలాగే ‘గ్లోబల్ ఆటోమెటిక్ ఎక్స్​చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్ వర్క్’​లోనూ సంతకం చేశాయి.