
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం (అక్టోబర్ 16) సచివాలయంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే, ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని వర్సిటీకి కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీని కింద జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని, ఉత్సవాల నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.