
ఖైరతాబాద్, వెలుగు : ఒకే వేదికపై 5 వందల రకాల భారతీయ స్వీట్లను ప్రదర్శించి బేగంపేటలోని కలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా వావ్ అనిపించింది. క్రిస్మస్ను పురస్కరించుకొని భారీస్థాయిలో స్వీట్లను తయారు చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, తూర్పు నుంచి పడమర వరకు ఇలా ఒక్కొక్క రాష్ట్రంలోని ఫేమస్ స్వీట్లను తయారుచేసింది. ఇండియా డెజర్ట్ పేరుతో ప్రదర్శించగా.. వీక్షకులకు నోరూరించాయి. స్వీట్ షాపులు, స్టూడెంట్ల తల్లిదండ్రులు, నిపుణులు ఇలా అందరి సహకారంతో స్వీట్లను తయారు చేసినట్లు కలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా చెఫ్ అక్షయ్ కులకర్ణి తెలిపారు.
పూతరేకులు, మోదక్, బుడ్డి కే బాల్, పేట, సోన్‌పాపిడి తదితర సంప్రదాయ స్వీట్లను తయారు చేసినట్లు చెప్పారు. 350 మంది స్టూడెంట్లు, చెఫ్‌లు 72 గంటల పాటు శ్రమించి వీటిని రూపొందించినట్టు పేర్కొన్నారు. ఇంతకుముందు 6 ప్రపంచ రికార్డులు సాధించామని, ఇప్పుడు ఏడో సారి ప్రపంచ రికార్డు ప్రయత్నం చేశామని వివరించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సుధాకర్ ఎన్ రావు, అతిక్ పాల్గొన్నారు.