నేటితరం నాయకులకు ఆది గురువు కాకా.. ఇవాళ( డిసెంబర్ 22) కాకా వర్ధంతి

నేటితరం నాయకులకు ఆది గురువు కాకా.. ఇవాళ( డిసెంబర్ 22) కాకా వర్ధంతి

భారతదేశ  రాజకీయాల్లో..  కాంగ్రెస్ పార్టీలో యువ కార్యకర్త  స్థాయి నుంచి ఉన్నత శిఖరాలు అధిరోహించిన నాయకుడు గడ్డం వెంకట్ స్వామి.  ఇందిరాగాంధీ నుంచి  సోనియాగాంధీ వరకు కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మహా నాయకుడు.  కుటుంబ పోషణ కోసం సాధారణ కూలీగా జీవితం ప్రారంభించి రాజకీయాలలో చేరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నేత  కాకా.  కార్మికుల పక్షపాతిగా కార్మికశాఖలో  సంస్కరణలు తీసుకువచ్చి కార్మికుల పక్షాన నిలిచిన నాయకుడు.  హైదరాబాద్,  సికింద్రాబాద్ జంట నగరాల్లో 85 వేల మంది పేదవారికి గుడిసెల వేయించి  ప్రజల దీవెనలు శాశ్వతం చేసుకొని గుడిసెల వెంకటస్వామిగా పేరుపొందిన నేత  గడ్డం వెంకటస్వామి.  భారతదేశ రాజకీయాల్లో కీర్తి కిరీటంగా నిలిచిపోయిన దళిత శిఖరం ఆయన. 


హైదరాబాద్​లోని  తోపుఖానా ప్రాంతంలో నివసించే గడ్డం పెంటమ్మ,  గడ్డం మల్లయ్యలకు మూడో సంతానంగా  గడ్డం  వెంకటస్వామి  జన్మించారు.  కుటుంబంలో  ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న తమ పిల్లలను ఉన్నత  చదువులు చదివించాలని గడ్డం మల్లయ్య ఆశించి చదువుకోసం సుల్తాన్ బజార్ లో  ఉన్న ఆర్య సమాజ్ పాఠశాలకు పంపించారు. 

నిజాం వ్యతిరేక పోరాటం 

మొగల్​పురాలోని  వస్తానియా హైస్కూల్లో ఉర్దూ మీడియంలో నాటి మెట్రిక్ పూర్తి చేశారు.  గడ్డం మల్లయ్య భవన నిర్మాణంలో చిన్నస్థాయి మేస్త్రి 
కాంట్రాక్టర్​గా విధులు  నిర్వహించారు.  తండ్రి మల్లయ్య ఆకస్మికంగా మరణించడంతో  కుమారులు  ముగ్గురు కూడా కుటుంబ పోషణకు  చదువులు మానేసి కూలీపనులకు  వెళ్లేవారు.  అదే సమయంలో  నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పోరాటాల్లో  కీలకభూమి పోషిస్తున్న ఆర్య సమాజ్ నిర్వాహకులు  రామానంద తీర్థ  పరిచయం కావడంతో  వెంకట స్వామి జీవితంలో  మార్పులు వచ్చాయి.  వారితోపాటు నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా చిన్న వయసులోనే పాల్గొన్నారు.  రాజకీయ  పరిస్థితులు మారడంతో పోలీసు యాక్షన్ ద్వారా  కాంగ్రెస్ పార్టీ  హైదరాబాద్ నిజాం స్టేట్​ని  భారతదేశంలో  సెప్టెంబర్ 1948లో విలీనం చేయడం జరిగింది.  కాంగ్రెస్ పార్టీ పట్ల  ఆసక్తి పెంచుకున్న యువకుడైన వెంకటస్వామి నాటి నాయకులతో కలిసి  1949 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకైన యువ కార్యకర్తగా పనిచేయటం ప్రారంభించారు.  స్వాతంత్ర్య ఉద్యమం నుంచి  ప్రారంభమైన ఆయన జీవితం ప్రత్యేక తెలంగాణ తొలిదశ,  మలిదశ ఉద్యమాలలో కూడా కీలక భూమిక పోషించారు.  

గుడిసెల వెంకటస్వామిగా...

భవన నిర్మాణ కార్మికుల నివాసాల కోసం హైదరాబాద్,  సికింద్రాబాద్ లో  ప్రభుత్వ స్థలాలలో  గుడిసెలు వేయించారు.  ఒకవైపు  కాంగ్రెస్ పార్టీలో  కీలక భూమిక పోషిస్తూనే  హైదరాబాద్​ నగరంలో కొత్తగా  వస్తున్న పరిశ్రమల్లో  పనిచేసే కార్మికులకు అండగా నిలిచి సంఘాలను ఏర్పాటు చేసి వారికి అండగా 
నిలబడ్డారు.  యువకుడిగా  ఉంటూనే  గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకుని సుమారు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో 88  ప్రాంతాలలో 85 వేల మందికిపైగా గుడిసెలు వేయించడంతో  ఆయన పేరు చిరస్థాయిగా గుడిసెల వెంకటస్వామిగా మారి పోయింది.   హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల వారి కోసం ఆనాటి భూదానోద్యమం స్ఫూర్తిగా నగరంలో పేదవారికి గుడిసెలు వేయించి నివాసాలు ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. కానీ, నాటి ప్రభుత్వాలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేశారని వాటిని తొలగించడానికి నోటీసులు జారీ చేశారు. అధికారుల పనితీరుకు ఆందోళన చెందిన వెంకటస్వామి  హైదరాబాద్​ నగరంలో లక్షమంది గుడిసెవాసులతో  కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. దీనితో ఆనాటి  ముఖ్యమంత్రి  నీలం సంజీవరెడ్డి  ఒక దశలో ఆందోళనకు గురై  చేసేది ఏమీలేక  గుడిసెవాసులు  నివాసముంటున్న స్థలాలకు అక్కడే పట్టాలిస్తామని పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ  ఘనత  వెంకటస్వామికే దక్కుతుంది. నాడు ప్రారంభమైన పేదల ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం నేటికీ కొనసాగుతోంది. 

1957లో  తొలిసారిగా శాసనసభకు..

భాషా  ప్రాతిపదికన  తెలంగాణ, ఆంధ్ర  కలయికతో  ఏర్పడ్డ  అసెంబ్లీలో 1957లో  తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన నాటి నుంచి ప్రారంభమైన రాజకీయ జీవన ప్రస్థానం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​లో  రాష్ట్రమంత్రిగా,  శాసనమండలి సభ్యునిగా,  ఏడుసార్లు పార్లమెంటు సభ్యునిగా,   కేంద్రమంత్రిగా అనేక హోదాలో పనిచేశారు.  కాంగ్రెస్  పార్టీలో తిరుగులేని నాయకునిగా ఎదిగి యువతరానికి ఆదర్శంగా దేశవ్యాప్తంగా నిలిచి అందరిచేత కాకా అని  పిలిపించుకున్న  గొప్పవ్యక్తి  గడ్డం  వెంకటస్వామి.  ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. 1967లో తొలిసారి పెద్దపల్లి  పార్లమెంటు నుంచి  ఎన్నికైన ఆయన అక్కడ బొగ్గు గని కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో సఫలీకృతుడయ్యారు.   కేంద్ర మంత్రిగా  పనిచేస్తూనే  కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నాయకుడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షునిగా,  కాంగ్రెస్ పార్టీ  అత్యున్నతమైన పార్టీ పదవి  సీడబ్ల్యూసీ  సభ్యునిగా అనేక హోదాల్లో పనిచేశారు. 

వెంకట్ స్వామి కుటుంబం

గడ్డం వెంకటస్వామికి హైదరాబాద్ ప్రాంత వాసి అయిన కళావతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు గడ్డం వినోద్,  గడ్డం వివేక్​లతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గడ్డం వినోద్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేయగా,  వివేక్  పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం గడ్డం వినోద్  
బెల్లంపల్లి శాసనసభ్యునిగా,  గడ్డం వివేక్ వెంకటస్వామి  రెండో  కుమారుడు చెన్నూరు శాసనసభ్యునిగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా , గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు, గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు. 

ఢిల్లీలోని తన సొంత నివాసాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ధర్మదాత

ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్న  ఎమర్జెన్సీకాలంలో జరిగిన రాజకీయ విభేదాల్లో  కాంగ్రెస్ పార్టీ అధికార కార్యాలయాన్ని  ప్రత్యర్థులకు వెళ్లిపోయింది. అలాంటి సమయంలో తనకోసం కేటాయించిన ఢిల్లీలోని అక్బర్ రోడ్​లో  కేటాయించిన ఇంటిని కాంగ్రెస్ పార్టీ అధికారిక  కార్యాలయానికి  ఇచ్చిన ధర్మదాత  గుడిసెల వెంకటస్వామి.  దళిత మాల సామాజిక వర్గం నుంచి వచ్చిన వెంకటస్వామి స్వయంగా ప్రజాసంఘాలతో పనిచేస్తూనే హైదరాబాద్  కేంద్రంగా  నిర్వహిస్తున్న దళిత,  బీసీ సంఘాలకు ఎప్పుడూ అండగా నిలిచేవాడు. హైదరాబాద్  లోయర్ ట్యాంక్ బండ్​లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతి ఏప్రిల్ 14న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వాన్ని ఆయన ఒప్పించారు. నాటి నుంచి నేటి వరకు మహనీయుల జయంతి, వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తొలి, మలిదశలలో  కీలక భూమిక పోషించిన కాకా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ కల సాకారం అనంతరం 2 డిసెంబర్ 2014న 85 సంవత్సరాల వయసులో సోమాజిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస వదిలారు. భారతదేశ రాజకీయాల్లో ఆయన ఒక మహోన్నత శిఖరంగా మిగిలిపోయారు.  కార్మికలోకానికి, ఇండ్లు లేని నిరుపేదలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. 

కార్మికుల పక్షపాతి వెంకటస్వామి

హైదరాబాద్​ నగర  చుట్టుపక్క ప్రాంతాల్లో  కొత్తగా వెలిసిన పరిశ్రమలలో సుమారు 100 కంపెనీలకు  ఐఎన్​టియుసి తరఫున నాయకుడిగా నిలబడ్డాడు. 1952లో మహారాష్ట్రలోని నాసిక్​లో జరిగిన మొదటి యువజన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.  మొదటిసారి ఆలిండియా స్థాయిలో  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు.  ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో  రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కుల వివక్ష వల్ల చివరి క్షణంలో దక్కకుండా పోయింది మరోసారి భారత రాష్ట్రపతిగా అవకాశమొచ్చిన రాజకీయ కారణాలతో వెనుకకు నెట్టేశారు. ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి  కాకా అంటూ ఆయన చుట్టూ తిరిగిన శిష్యులు చాలామంది  ముఖ్యమంత్రిగా,  కేంద్ర మంత్రులుగా  అగ్రకులాలవారు ఎదిగారు. 1973లో  కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నాయన కార్మికశాఖలో  అనేక సంస్కరణలను తీసుకొచ్చారు.  

కార్మికులకు పీఎఫ్,  వైద్య సౌకర్యం

1960 -70, 80  దశకంలో  హైదరాబాద్ చుట్టుపక్కల,  సింగరేణి కాలనీ ప్రాంతమైన బెల్లంపల్లి,  మంచిర్యాల,  కొత్తగూడెం  ప్రాంతాలలో  సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన నిలిచి వారికి  పీఎఫ్,  వైద్య సౌకర్యంతోపాటు,  ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో  పనిచేస్తున్న కార్మికులకు సైతం గ్రాట్యుటీ  సౌకర్యం కల్పించడం కోసం కృషి చేశారు. 1961లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఎన్​టియుసి ఏర్పాటు చేసి 1980 దశకం వరకు ఆయనే అధ్యక్షునిగా కొనసాగారు. తర్వాత కాలంలో టి. అంజయ్య, సంజీవరెడ్డిలు కొనసాగారు.  ప్రైవేటు  కంపెనీలో  పనిచేసే సిబ్బందికి కూడా ఈ పీఎఫ్ సౌకర్యం కల్పించి ఏర్పాటు చేశారు దీంతో నేటికీ ప్రైవేట్ ఉద్యోగులు గుడిసెల వెంకటస్వామి పెన్షన్​గా చెప్పుకుంటారు.  1993లో కేంద్ర  జౌళిశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయన సంబంధిత రంగాలలో లోటుపాటులను తెలుసుకొని సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రగాఢ కోటయ్యలాంటి వారి సూచనలు,  సలహాలు తీసుకొని చేనేత కార్మికులకు చేయూతనివ్వటానికి అనేక రకాల కొత్తగా స్కీమ్​లు తీసుకొచ్చారు. 

- అస శ్రీరాములు,
 సీనియర్ జర్నలిస్ట్