ఇంటర్ లో ఫెయిలైనోళ్లకు పాస్ మార్కులు

ఇంటర్ లో ఫెయిలైనోళ్లకు పాస్ మార్కులు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ లో సగం మందికి పైగా స్టూడెంట్లు ఫెయిల్ కావడం, వారికి న్యాయం చేయాలని స్టూడెంట్ యూనియన్లు ఆందోళనలు చేస్తుండడంతో ఏం చేయాలనే దానిపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన పడుతోంది. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి రిపోర్టు అడిగింది. ఫెయిలైనోళ్లందరినీ మినిమమ్ మార్కులతో పాస్ చేయాలని బోర్డు ప్రపోజల్ పంపినట్లు తెలిసింది. దీని సాధ్యాసాధ్యాలపై సీఎం ఆఫీస్ పరిశీలిస్తోంది. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల చేయగా, 51% మంది ఫెయిలయ్యారు. ఫెయిలయ్యామని ముగ్గురు స్టూడెంట్లు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్ యూనియన్లు ఆందోళన బాటపట్టాయి. ఫెయిలైన స్టూడెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

శుక్ర, శనివారాల్లో ఇంటర్ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు.. సోమ, మంగళవారాల్లో జూనియర్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. జిల్లాల్లోని డీఐఈఓ ఆఫీసులు, కలెక్టరేట్ల ముందూ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు తక్కువ మార్కులు వచ్చాయంటూ స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. 

అదొక్కటే మార్గం.. 
స్టూడెంట్ల ఆందోళనలు ఎక్కువ కావడంతో  మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెండ్రోజుల కింద ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే దానిపై రిపోర్టు ఇవ్వాలని ఎడ్యుకేషన్ అధికారులను సీఎంఓ ఆఫీసర్లు ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ, ఇంటర్ బోర్డు ఆఫీసర్లు శనివారం రిపోర్టు అందజేశారు. ‘‘కరోనా కారణంగా స్టూడెంట్లు పెద్దగా చదువుపై దృష్టి పెట్టలేదు. కాబట్టి మినిమమ్ మార్కులతో పాస్ చేయడమే ఉత్తమం” అని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఒక్కో సబ్జెక్టులో 5 నుంచి10 మార్కులు కలిపితే ఎంతమంది పాస్ అవుతారనే వివరాలను రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో ఎలా చేశారనే వివరాలనూ రిపోర్టులో పొందుపరిచారు. ఏపీలో ముందుగానే అందరినీ పాస్ చేసి, ఆ తర్వాత పరీక్షలు పెట్టారు. దీంతో అక్కడ ఫెయిల్ అనే మాటే లేకుండా పోయింది. కాగా, ఫెయిలైనోళ్లను మినిమమ్ మార్కులతో పాస్ చేయడం తప్పా, వేరే ఏం చేసినా ఉపయోగం ఉండదని విద్యాశాఖ ఆఫీసర్లు అంటున్నారు. ప్రస్తుతం స్టూడెంట్ల ఆందోళనలు ఎక్కువవుతుండడంతో సీఎం కేసీఆర్ త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.