ఏప్రిల్ నాటికి 51మంది ఎంపీలు రిటైర్

ఏప్రిల్ నాటికి 51మంది ఎంపీలు రిటైర్

ఏప్రిల్‌ నెలాఖరుకు రాజ్యసభ నుంచి మంది 51రిటైర్

వీళ్లలో 11 మంది హస్తం పార్టీ వాళ్లే
బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే చాన్స్!

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరునాటికి 51 మంది రాజ్యసభ ఎంపీలు రిటైర్ కావడంతో పెద్దల సభలో బలాబలాలపై రాజకీయ ఎనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. ఖాళీలకు జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీ, కాంగ్రెస్ గెలిచే చాన్స్​లున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు కూడా ఎక్కువ సీట్లను దక్కించుకోనున్నాయి. బీజేపీకి రాజ్యసభలో 82 మంది సభ్యు లున్నారు. ఏప్రిల్ తర్వాత మరో 13 మంది సభ్యులు ఆపార్టీ తరపున ఎన్నిక కానున్నారు. ఒడిశా నుంచి 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో బీజేడీ 2, బీజేపీ ఒక సీటును గెలిచే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న 4 సీట్లనూ అధికార వైఎస్ఆర్సీపీ గెలుచుకోనుంది. హిమాచల్ ప్రదేశ్ , హర్యానా నుంచి ఒక్కో సీటును బీజేపీ గెలవనుంది. రాజ్యసభలో 46 మంది సభ్యులున్న కాంగ్రెస్ బలం ఏప్రిల్ తర్వాత 56కి పెరగనుంది. అంటే మరో 10 సీట్లు ఆపార్టీకి దక్కనున్నాయి. 11 మంది కాంగ్రెస్ సభ్యులు రెండు నెలల్లో రిటైర్ కానున్నారు.

రాష్ట్రా ల్లో పరిస్థితి ఎలా ఉంది?
మహారాష్ట్ర: రాష్ట్రం నుంచి పార్టీ తరపున ఇద్దరు మెంబర్లు రాజ్యసభకు ఎన్నికవుతారని బీజేపీ నేతలు అంచనావేస్తున్నారు. శివసేన దూరం కావడంతో బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. శివసేన ఒకటి, ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోనున్నాయి. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అభ్యర్థి రామ్ దాస్ అథ్ వాలేకి మరోచాన్స్​ వచ్చే అవకాశముందంటున్నారు.
బెంగాల్: బెంగాల్‌లోని ఐదు సీట్లలో నాలుగు సీట్లను తృణ మూల్ గెలుచుకుంటుందని అంచనా. సీతారాం ఏచూరిని సీపీఎం బరిలోకి దింపితే సపోర్ట్​ చేస్తామని కాంగ్రెస్ సూచనప్రాయంగా తెలిపింది.
బీహార్: బీజేపీ–జేడీయూ కూటమికి మూడు సీట్లు వస్తాయి. ఆర్జేడీ రెండు సీట్లలో గెలుస్తుంది. మాజీ సీఎం రబ్రీదేవిని ఆర్జేడీ నామినేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
తమిళనాడు: ఆరు సీట్లలో ఏఐఏడీఎంకే, డీఎంకే మూడేసి సీట్లు గెలిచే చాన్స్​లు ఉన్నాయి. ఏఐఏడీఎంకే ఎంపీలు ఇప్పుడు రాజ్యసభలో 11 మంది ఉన్నారు.
మధ్యప్రదేశ్: బీజేపీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఈసారి మూడు సీట్లకుగాను ఆపార్టీకి ఒక్కసీటు మాత్రమే దక్కనుంది. కాంగ్రెస్ బలం రెండుకు పెరగనుంది.

రిటైర్ కానున్న ప్రముఖులు
హరివంశ్ ( రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ), శరద్ పవార్ (ఎన్సీపీ చీఫ్ ), రామ్ దాస్ అథవాలె (కేంద్రమంత్రి), మోతీలాల్
ఓరా, దిగ్విజయ్ సింగ్, మధుసూదన్ మిస్ట్రీ (కాంగ్రెస్ ), విజయ్ గోయల్, సత్యనారాయణ్ జతియా (బీజేపీ), టి.శివ (డీఎంకే ).