17 రోజుల్లో 5.35 లక్షల ట్రాఫిక్ కేసులు

17 రోజుల్లో 5.35 లక్షల ట్రాఫిక్ కేసులు

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ లో అత్యవసర సేవలు అందజేస్తున్నారా.. అయితే కాస్త జాగ్రత్తగా చూసి బండి నడపండి. రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఓవర్ స్పీడ్ గా వెళ్లడం, చెకింగ్ లేదని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, రెడ్ సిగ్నల్ పడినా రోడ్డు ఖాళీగా ఉందని దూసుకెళ్లడం, బైక్ కు సైడ్ మిర్రర్లు తీసేయడం.. లాంటివి చేయకండి. ఒకవేళ అలా చేస్తే మీ వెహికల్ పై కేసు రిజిస్టర్ కావడం, మీకు చలానా రావడం ఖాయం. అవును మరి.. లాక్ డౌన్ లో గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ వయోలేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత ప్రయాణిస్తున్న అత్యవసర సేవల వాహనాలపై దృష్టిసారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. వితౌట్ హెల్మెట్, సైడ్ మిర్రర్, ఇంప్రాపర్‌‌ నంబర్‌ ‌ప్లేట్స్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, మాస్క్‌ వయోలేషన్‌ కేసులు నమోదు చేస్తున్నారు.

17 రోజుల్లో 5.35 లక్షల కేసులు

ఈ నెల12 నుంచి లాక్‌డౌన్‌, ట్రాఫిక్‌ రూల్స్ వయోలేషన్స్ పై ఐటీఎంఎస్‌తో ఆన్‌లైన్ లో కేసులు నమోదు చేస్తున్నారు. గ్రేటర్‌‌లోని మూడు కమిషనరేట్లలో గత 17 రోజుల్లో 5,35,669 ట్రాఫిక్ వయేలేషన్ కేసులు రిజిస్టర్ చేశారు. వీటిలో 80 శాతం హెల్మెట్‌ జరిమానాలే ఉన్నాయి. సీసీ టీవీ కెమెరాలు, నంబర్ రికగ్నేషన్ సిస్టమ్ ఆధారంగా, డిజిటల్‌ హ్యాండ్‌ కెమెరాలతో క్లిక్ చేసి ఫైన్లు వేస్తున్నారు. ఫొటోలను టీఎస్ పోలీస్ కాప్ యాప్ లో అప్ లోడ్ చేసి జరిమానాలు పంపిస్తున్నారు. చెక్ పోస్టులు, జంక్షన్ల వద్ద నిఘా వేస్తున్న పోలీసులు ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. సిటీ రోడ్లను బషీర్‌‌బాగ్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌‌ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.