
న్యూఢిల్లీ: శత్రు దేశాల నౌకలను, సబ్మెరైన్లను అడ్డుకునేందుకు చైనా అమర్చిన ఉచ్చులో తన సొంత సబ్‌మెరైనే చిక్కుకుంది. దీంతో అందులోని 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటినా చైనా సర్కారు మాత్రం ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొద్దిరోజులకిందే అమెరికన్ నేవీ ఈ విషయాన్ని బయటపెట్టగా.. అదంతా ఉత్త ముచ్చటేనంటూ డ్రాగన్ దేశం కొట్టిపారేసింది. అయితే, సబ్‌మెరైన్ మునిగింది, 55 మంది ప్రాణాలు నీళ్లలో కలిసింది నిజమేనంటూ బ్రిటిష్ ఇంటలిజెన్స్ వర్గాలు తేల్చిన రిపోర్టును ఇంటర్నేషనల్ మీడియా తాజాగా బయటపెట్టింది.
ఆక్సిజన్ అందకపోవడంతో..
చైనా తయారు చేసిన అత్యాధునిక 093–417 న్యూక్లియర్ సబ్‌మెరైన్ దాదాపు 350 అడుగుల పొడవు ఉంటుంది. ఇది.. షాండాంగ్ ప్రావిన్స్‌లోని ఎల్లో సముద్రంలో ఆగస్ట్ 21న ఉదయం 8.21 గంటలకు ట్రాప్‌లో చిక్కుకుంది. అమెరికా, బ్రిటన్ సబ్మెరైన్లను అడ్డుకునేందుకు చైనానే ఏర్పాటుచేసిన ఈ ట్రాప్ ‘చైన్–యాంకర్’ను సబ్‌మెరైన్ ఢీకొట్టింది. దీంతో సబ్‌మెరైన్‌లోని బ్యాటరీ సిస్టమ్ దెబ్బతిని అందులోని ఎయిర్ ప్యూరిఫైర్, ఎయిర్ సిస్టమ్స్ పనిచేయక పోయుండొచ్చని రిపోర్టులో పేర్కొంది. ఆల్టర్నేట్ ఆక్సిజన్ కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టి సబ్‌మెరైన్ లోపలున్న ఆక్సిజన్ విషపూరితం అయి ఉంటుందని పేర్కొంది. మరమ్మతులకు 6 గంటలకు పైగా పట్టిందని, ఆలోపే 55 మంది చనిపోయారని బ్రిటన్ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. మృతుల్లో సబ్‌మెరైన్ కెప్టెన్‌తో సహా ఆఫీసర్లు, కేడెట్స్, నేవీ సిబ్బంది ఉన్నారని చెప్పాయి. ఈ ఘటన జరిగిన వెంటనే వెస్ట్రన్ కంట్రీస్ పత్రికలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. సబ్‌మెరైన్ ప్రమాదంలో ఉన్నట్లు మెసేజ్ అందినట్లు పొరుగు దేశాలు కూడా ప్రకటించాయి. చైనా మాత్రం అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేసింది.