ఎఫ్‌ఎస్‌ఎల్‌కు 59 మంది ఎంపిక

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు 59 మంది ఎంపిక
  • గతేడాది నోటిఫికేషన్‌ ప్రకారం ఖాళీలను భర్తీ చేసిన టీజీ పీఆర్‌‌బీ
  • ఈ నెల 23 నుంచి 25 వరకు వెబ్‌సైట్‌లో అటెస్టేషన్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది. మొత్తం 60 పోస్టులకు గాను 59 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీజీ పీఆర్‌‌బీ) చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. 2025 నవంబర్ 14న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులకు గాను అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్/జనరల్) విభాగంలో రెండు ఖాళీలకు గారు ఇద్దరు పురుషులు, సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్) విభాగంలోని మూడు ఖాళీలకు గాను ఇద్దరు పురుషులు, ఒక మహిళా అభ్యర్థి ఎంపికయ్యారని వివరించారు. సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ/సెరోలజీలో మూడు ఖాళీలకు గాను పురుషుడు, ఇద్దరు మహిళలు, కంప్యూటర్స్ విభాగంలో 2 ఖాళీలకు ఒక్కొక్కరు చొప్పున పురుష, మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు.

దీంతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగాల్లో ఫిజికల్/జనరల్‌లో ఐదుగురు, కెమికల్‌ విభాగంలో 10 ఖాళీలకు గారు 8 మంది పురుషులు, ఒక మహిళా అభ్యర్థిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇలా అన్ని విభాగాలకు గాను 59 మందిని అభ్యర్థుల అకడమిక్ మార్కులు, పని అనుభవం, రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికలు చేశామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 25 వరకు వెబ్‌సైట్‌లో అటెస్టేషన్ ఫారాలను పూర్తిచేసి, మార్చి 30న హైరాబాద్‌లోని పేట్లబురుజు సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్ కార్యాలయంలో సమర్పించాలని బోర్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస రావు సూచించారు.