ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. భివాండి తాలూకాలోని పద్ఘా ఏరియాలో కంటైనర్ ట్రక్కు, జీపును ఢీకొట్టి దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. స్టూడెంట్లు, ఇతర ప్రయాణికులతో జీపు పద్ఘా నుంచి ఖడావలీ రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా, ట్రక్కు ఎదురుగా వచ్చి ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు.
ట్రక్కు ఢీకొన్న వేగానికి జీపు100 మీటర్ల దూరంలో బోల్తా పడిందని తెలిపారు. దాంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని, ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మృతులను చిన్మయ్ షిండే (15), రియా పరదేశి, చైతాలి పింపుల్ (27), సంతోష్ అనంత్ జాదవ్ (50), వసంత్ ధర్మ జాదవ్ (50), ప్రజ్వల్ ఫిర్కేగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిని భివాండిలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నామని..స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురు ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
