- జియో పొలిటికల్ టెన్షన్లు తగ్గడం, డాలర్ బలపడడం, ప్రాఫిట్ బుకింగే కారణం
- 2026లో ధరలు మరింత పడతాయని ఎనలిస్టుల అంచనా
- 25-30 శాతం మేర ధరలు తగ్గే ఛాన్స్
వెండి పరుగుకు బ్రేక్ పడింది. ఇటీవల రికార్డ్ గరిష్టాలకు చేరిన సిల్వర్ ధర సోమవారం ఒక్కరోజే రూ.21 వేలు పడిపోయింది. శనివారం కేజీ వెండి రూ.2,54,174 ఉండగా అది సోమవారం రూ.2,33,120కి దిగొచ్చింది.
ముంబై: రికార్డ్ గరిష్టాలకు చేరిన వెండి ధరలు దిగొస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో సిల్వర్ ధరలు సోమవారం 8 శాతం వరకు (రూ.21 వేలు) కుప్పకూలాయి. జియోపాలిటికల్ టెన్షన్లు తగ్గడంతో పాటు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో ధరలు తగ్గుతున్నాయి. వీటికితోడు షికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్ పెంచడం, డాలర్ బలపడటం ఈ తగ్గుదలను మరింత వేగవంతం చేశాయి.
* ధరలు పడడానికి కారణాలు..
ఎంసీఎక్స్‌లో వెండి మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8శాతం పడిపోయి కేజీకి రూ.2,54,174 నుంచి రూ.2,33,120కి దిగొచ్చాయి. ఇంట్రాడేలో రూ.2,25,000 వరకు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో 80 డాలర్ల వరకు వెళ్లిన ఔన్స్ (28 గ్రాముల) వెండి ధర, తాజాగా 75 డాలర్ల దిగువకు పడిపోయింది.
* శాంతి చర్చలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు ముందుకు సాగడంతో సేఫ్ హెవెన్ అయిన వెండికి డిమాండ్ తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్ అంతటా ప్రాఫిట్ బుకింగ్ పెరిగింది.
* టెక్నికల్‌గా చూస్తే..
“సిల్వర్ ధరలు 200 డైలీ మూవింగ్ యావరేజ్ (డీఎంఏ) ధర కంటే 89 శాతం ఎక్కువగా ఉన్నాయి. ధరలు మరింతగా పడతాయని అంచనావేయొచ్చు’’ బీటీఐజీ ఎనలిస్ట్ జోనాథన్ క్రిన్స్కీ పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో ఔన్స్ వెండి ధర 55 డాలర్ల వరకు పడొచ్చని, రికార్డ్ గరిష్టం నుంచి ఇది 25–-30 శాతం తక్కువని అన్నారు. గతంలో 1979, 2011లో కూడా వెండి ధరలు భారీగా పెరిగాయని, అక్కడి నుంచి 75-–90శాతం వరకు పతనమయ్యాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సీఐఓ మనీష్ బంతియా గుర్తుచేశారు.
* పీక్ నుంచి డౌన్..
వెండి ధరలు గత శుక్రవారం 10శాతం పెరిగాయని, ఒక్కసారిగా పెరగడం చూస్తే పీక్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు చెప్పారు.
* రికార్డు వారాంత లాభాలు
గత వారం సిల్వర్ ధరలు 18శాతం పెరిగాయి. ఇది 45 ఏళ్లలోనే అత్యధికం. టెక్నికల్‌గా చూస్తే ఎంసీఎక్స్ డైలీ చార్ట్‌లో ఆర్‌ఎస్‌ఐ 91కి చేరింది. ఇది వెండి ధరలు ఓవర్‌బాట్ (అతిగా కొనే)జోన్‌లో ఉన్నాయని తెలియజేస్తోంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు.
* సీఎంఈ మార్జిన్ పెంపు
షికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ (సీఎంఈ) సిల్వర్ ఫ్యూచర్స్ మార్జిన్‌ను 20 డాలర్ల నుంచి 25 వేల డాలర్లకి పెంచడంతో ట్రేడర్లు అదనంగా ఫండ్స్ ఖర్చు చేయాలి. దీంతో పెట్టుబడులు తగ్గాయి.
* డాలర్ బలపడటం
అమెరికా డాలర్, బాండ్ యీల్డ్స్ పెరగడంతో సిల్వర్ ఆకర్షణ తగ్గింది. ఫండ్స్ ఈక్విటీల్లోకి మళ్లాయి.
* ఫ్యూచర్‌లో..
“సిల్వర్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. కానీ వోలటాలిటీ ఎక్కువ. ఎంసీఎక్స్‌లో రూ.2.4 లక్షల లెవెల్ వద్ద సపోర్ట్ ఉంది” అని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జిగర్ త్రివేది అన్నారు.
