హత్రాస్​లో మరో దారుణం.. రేప్ కు గురైన ఆరేళ్ల బాలిక మృతి

హత్రాస్​లో మరో దారుణం.. రేప్ కు గురైన ఆరేళ్ల బాలిక మృతి

అలీగఢ్ (ఉత్తరప్రదేశ్): యూపీలోని హత్రాస్ ఘటన మరువక ముందే అదే జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక రేప్ కు గురై మరణించింది. బంధువు చేతిలో రేప్ కు గురైన చిన్నారి, ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మునిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 17న అలీగఢ్ జిల్లా ఇగ్లాస్ ఏరియాలోని ఇంటిపై రైడ్ చేశాం. బంధువుల ఇంట్లో నిర్బంధంలో ఉన్న మైనర్ ను గుర్తించాం. బాలికను జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చేర్పించాం. నాలుగు రోజుల ట్రీట్ మెంట్ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కు షిప్ట్ చేశాం. ఆరోగ్య పరిస్థితి విషమించి బాలిక సోమవారం మరణించింది’ అని చెప్పారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో సెప్టెంబర్ 21నే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నేరం ఒప్పుకున్న 15 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి తల్లి మృతురాలికి పిన్ని అవుతుందని, ఆమె కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే బిడ్డను కోల్పోయామని, బాలిక మృతదేహంతో పేరెంట్స్ హత్రాస్‌లో రోడ్డుపై నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో అంత్యక్రియలకు అంగీకరించారు. ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు ఎస్ఎస్పీ తెలిపారు.