
ఆడుకోవడానికి బయటికి వెళ్లిన తమ ఆరేళ్ల పసి పాప ఆదృశ్యమవడంతో ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదంటూ.. ఆచూకీ కనిపెట్టమంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసుకున్న వారికి చివరికి ఆ పాప మృతదేహంగా కనిపించింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
బాధితులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర సమీపంలోని తుర్కపల్లి గ్రామంలో నివాసముంటున్న చంద్రం అనే వ్యక్తి తన కూతురు ప్రవళిక(6) కనిపించడం లేదంటూ గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెలవు రోజు కావడంతో నిన్న మధ్యాహ్న సమయంలో బయటికెళ్లిన పాప ఆ తర్వాత 3:00 గం. నుంచి కనిపించకపోవడంతో ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాపను వెతికే క్రమంలో… తుర్కపల్లి ఏ ఆర్ కే హోమ్స్ సమీపంలోని ఓ నిర్మానుష ప్రాంతంలో పాప మృతదేహాన్ని కనుగొన్నారు.
మృతదేహాన్ని పరిశీలించి చూడగా.. పాప అత్యాచారానికి గురై ఆపై దారుణంగా హతమార్చబడిందని వారు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి అకృత్యానికి బలైన ఆ పాప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ ఐ శ్రీశ్తెలం తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన పాప విగత జీవిగా అగుపించడం చూసి ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఆ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలన పాప బంధువులు డిమాండ్ చేశారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ కామాంధుడిని పట్టుకొని తీరుతామని.. అతని కోసం డాగ్ స్క్యాడ్ ,క్లూస్ టీం తో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.