ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి ఘటనలో..60 మంది రైతులపై హత్యాయత్నం కేసులు

ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి ఘటనలో..60 మంది రైతులపై హత్యాయత్నం కేసులు
  •     అడిషనల్​ కలెక్టర్​ హామీ ఇచ్చిన కొద్దిసేపటికే నమోదు 
  •     పరిశ్రమ ఉద్యోగులు కంప్లయింట్​ ఇచ్చారన్న ఎస్ఐ
  •     ఫిర్యాదు చేసిన  వారిలో ఇద్దరు కానిస్టేబుల్స్​  

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లా దిలావర్ పూర్, గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ బుధవారం ఆందోళన చేసిన 60  మంది రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. రెండు గ్రామాల మధ్య పొలాల్లో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను తరలించాంటూ రైతులు మూడు నెలల నుంచి పోరాటం చేస్తున్నారు.  ఇందులో భాగంగా బుధవారం దిలావర్ పూర్, గుండంపెల్లి గ్రామాల రైతులు ఫ్యాక్టరీ వద్దకు తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో రైతులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఆఫీసు కిటికీ, ఓ కారు అద్దాలు పగలగొట్టారు. మరో కారును దగ్ధం చేశారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్​కలెక్టర్​కిశోర్​బాబు గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడారు. వినతిపత్రం ఇస్తే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. 

రాత్రికి రాత్రే కేసులు  

అడిషనల్​కలెక్టర్​ హామీ ఇచ్చి వెళ్లిన కొద్దిసేపటికే 60 మంది రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసులు  నమోదు చేశారు. రైతులు ఫ్యాక్టరీ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా తమను చంపేందుకు ప్రయత్నించారంటూ ఫ్యాక్టరీ  ఉద్యోగులతో పాటు కొందరు పోలీసులు దిలావర్​పూర్​పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. త్వరలోనే వీరందరినీ అరెస్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇథనాల్ పరిశ్రమ ప్రతినిధి ఫిర్యాదు మేరకే హత్యాయత్నం కేసులు పెట్టామని దిలావర్​పూర్ ఎస్ఐ యాసిన్ ఆరాఫత్ చెబుతుండగా, ఎఫ్​ఐఆర్​లో మాత్రం ఇద్దరు కానిస్టేబుల్స్ ​కూడా కంప్లయింట్ ​ఇచ్చినట్టు ఉంది.