టీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నరు

టీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నరు

గత నాలుగేళ్లలో కొడంగల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప.. ప్రస్తుత ఎమ్మెల్యే చేసింది శూన్యమన్నారు. కేటీఆర్ మాటలు నమ్మి టీఆర్ఎస్ను గెలిపిస్తే ఏం జరిగిందో చూశారని నియోజకవర్గ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని.. పోలీస్స్టేషన్లు పైరవీకారులకు అడ్డాగా మారాయని ఆరోపించారు. మద్దూరు మండలానికి చెందిన సుమారు 60మంది యువకులు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మద్దూరు మండలంలో తాగునీరు, రోడ్లు, విద్య, విద్యుత్ సదుపాయాలను తన హయాంలోనే కల్పించామని చెప్పారు.

రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు మనం సంతకం పెడితేనే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని..ఆ అవకాశం సోనియా గాంధీ కొడంగల్ కు ఇచ్చారని రేవంత్ అన్నారు. కేసీఆర్, మోడీ కలిసి కృష్ణా- వికారాబాద్ రైలును కొడంగల్ ప్రాంతానికి రాకుండా ఆపారని ఆరోపించారు. గతంలో కొడంగల్ గౌరవం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. గ్రామాల్లో 5వేల ట్రాన్స్ఫార్మర్లు  ఏర్పాటు చేయడంతోపాటు ఎన్నో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించారు.