రైల్వే భద్రతకు ప్రత్యేక చర్యలు : రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ్

రైల్వే భద్రతకు ప్రత్యేక చర్యలు :  రైల్వే జీఎం  సంజయ్ శ్రీవాస్తవ్
  •     దక్షిణమధ్య రైల్వే జీఎం  సంజయ్​ శ్రీవాస్తవ్ వెల్లడి

హైదరాబాద్​సిటీ,వెలుగు: ​ రైల్వే ప్రాంగణాల్లో  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​కుమార్​ శ్రీవాస్తవ్​ తెలిపారు. సోమవారం ఆయన రైల్వే భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ప్రమాదాల నివారణకు  పరికరాల నిర్వహణ, క్రమం తప్పకుండా తనిఖీలు మొదలైన భద్రతా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్టేషన్లు, గూడ్స్, షెడ్లు, నాన్-ఇంటర్‌‌లాక్డ్ లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు. 

అంతేకాకుండా, పశువులు రైలు కింద పడి చనిపోయే ఘటనలను నివారించడానికి జోన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రైలు పట్టాల వెంబడి  కంచె నిర్మాణ పనులను కూడా జీఎం సమీక్షించారు. రైలు కార్యకలాపాలపై జోన్ వ్యాప్తంగా  తగిన భద్రతా చర్యలను నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. లెవెల్​ క్రాసింగ్‌‌లలో భద్రతా డ్రైవ్‌‌లు,అగ్నిమాపక భద్రతకు సంబంధించిన  ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణంలో ధూమపానం, మద్యపానాన్ని కచ్చితంగా నిరోధించాలని అధికారులను ఆదేశించారు. 

ప్రయాణీకుల భద్రత, క్రమశిక్షణను నిర్ధారించడానికి ఆర్‌‌పీఎఫ్, ఆన్‌‌బోర్డ్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సంజయ్ చెప్పారు. మీటింగులో అదనపు జీఎం సత్య ప్రకాశ్ , వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు : ప్యాకేజీలను ప్రకటించిన రైల్వే

నస్పూర్, వెలుగు: తీర్థ యాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చిందని ఐఆర్‌‌‌‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ తెలిపారు. సోమవారం మంచిర్యాలలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.కృష్ణమూర్తి, రైల్వే అధికారులతో కలిసి రైల్ టూర్ ప్యాకేజీ బ్రోచర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 

‘తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో 2 ప్రత్యేక ప్యాకేజీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొదటి ప్యాకేజీ(తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు)యాత్ర మార్చి 21 ప్రారంభమై 28వ తేదీ వరకు ఉంటుందన్నారు. రెండో ప్యాకేజీ( ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్‌, పుణె, నాసిక్‌, ఔరంగబాద్‌)యాత్ర ఏప్రిల్ 14న ప్రారంభమై 24 వరకు ఉంటుందని తెలిపారు. 

యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ ధర్మాబాద్; ముద్ఖేడ్ హజూర్ సాహిబ్ నాందేడ్; పూర్ణ మీదుగా కొనసాగుతుందన్నారు. ప్రయాణ బీమా, రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితమని తెలిపారు. వివరాలకు 97013 60701, 92810 30727, 92810 30759 నంబర్లను సంప్రదించాలన్నారు.