మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్ కు ముందు రోజే అభ్యర్థి ఆత్మహత్య

మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్ కు ముందు రోజే  అభ్యర్థి ఆత్మహత్య

నారాయణ పేట్ జిల్లాలో దారుణం జరిగింది. మున్సిపల ఎన్నికలు రేపు జరగనుండగా.. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 10న   తన ఇంట్లో మహదేవ్ ఉరేసుకున్నాడు. మహదేవ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు అంటే ఒక్కరోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభ్యర్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.

రేపే పోలింగ్

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి ఫిబ్రవరి 9తో తెరపడింది. ఆరు రోజులుగా డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పట్టణాలు  ఇప్పుడు ‘సైలెంట్ మోడ్​’ లోకి మారిపోయాయి. ఫిబ్రవరి11న పోలింగ్​ జరగనుండగా 48 గంటల ముందే బహిరంగ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. మనీ, మందు, ఇతర కానుకలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా  సోమవారం రాత్రి నుంచి మున్సిపాలిటీలపై నిఘా పెట్టారు. మరోవైపు పోలింగ్​ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికలు జరగబోయే ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో  సిబ్బందికి మంగళవారం పోలింగ్​సామగ్రి పంపిణీ కార్యక్రమం ఉంటుంది.  మొత్తం 2,996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా..  మిగిలిన 2,982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 31,428 ఇతర పోలింగ్​ సిబ్బందిని నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్​ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి తీసుకొని నేటి సాయంత్రం అన్ని పోలింగ్​స్టేషన్లకు చేరుకుంటారు.