హైదరాబాద్, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కృష్ణా నదీ తీరంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెంవద్ద సుమారు మూడు వేల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇనుప యుగానికి చెందిన వందలాది బృహత్ శిలా సమాధులు, ఇనుము తయారీ ఆనవాళ్లతో పాటు కందూరి చోళులు, రేచర్ల పద్మనాయకుల కాలం నాటి కోట గోడలు, ఆలయాలు బయటపడ్డాయి. అలాగే కాకతీయ రాణి రుద్రమదేవి కాలం నాటి రహస్య ధాన్యాగారాలుగా భావిస్తున్న సున్నపుపూత పూసిన గుండ్రటి నిర్మాణాలు సైతం ఇక్కడ కనిపించాయి.
ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతం సిమెంట్ కంపెనీల తవ్వకాలు, గుప్తనిధుల తవ్వకాల కారణంగా ధ్వంసం అవుతోందని, పద్మనాయకుల కాలం నాటి లక్ష్మీనరసింహాలయం సహా పలు విగ్రహాలు దెబ్బతిన్నాయని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక సంపద కనుమరుగు కాకముందే దీనిని పరిరక్షించేందుకు పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
