రాష్ట్రంలో కేటీఆర్ కథ క్లోజ్‌ : బల్మూరి వెంకట్

రాష్ట్రంలో కేటీఆర్ కథ క్లోజ్‌ : బల్మూరి వెంకట్
  •     సిరిసిల్లలో బీఆర్‌‌ఎస్‌ను చిత్తుగా ఓడించబోతున్నరు: బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేటీఆర్ క‌థ ముగిసిందని, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌ పార్టీని చిత్తుచిత్తుగా ప్రజ‌లు ఓడించ‌బోతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కాళ్ల కింద భూమి క‌దిలిపోవ‌డంతో కేటీఆర్ కుత‌కుత ఉడికిపోతున్నారన్నారు. రాజ‌కీయ భ‌విష్యత్ గ‌ల్లంతు అవుతుంద‌న్న భ‌యంతో మా సీఎంపై నోరు పారేసుకుంటున్నారని, అస‌హ‌నంతో నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 

‘‘కేటీఆర్.. నువ్వెంత గింజుకున్నా సిరిసిల్లలో నీకు ఎండ్ కార్డు వేస్తున్నాం. రాష్ట్రంలో నీ క‌థ క్లైమాక్స్‌కు చేరింది. నువ్వెడివి తెలంగాణ‌కు.. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎంత‌? అమెరికాలో అంట్లు క‌డుక్కుని బ‌తికేటోడివి.. మీ అయ్యను అడ్డం పెట్టుకుని తెలంగాణ‌కు వ‌చ్చిన‌వు.. కేకే, కె.మ‌హేంద‌ర్ రెడ్డి లాంటి ఉద్యమ‌కారుల గొంతుకోసి సిరిసిల్ల సీటు సంపాదించావు. 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప‌దేండ్లు ఎన్నో నీచ‌పు ప‌నులు చేశావు. పాస్ పోర్టు బ్రోక‌ర్లు ఎవ‌రో తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసు. ప‌దేండ్లు ఎవ‌రు బ్రోక‌ర్ ప‌నులు, బేకారు ప‌నులు చేశారో చిన్న పిల్లల‌ను అడిగినా చెప్తరు. కేటీఆర్ నీ భాష మార్చుకోకపోతే ప్రజలు ఉరికించి కొడ్తరు. సొంత చెల్లెలు నీ ముఖం మీద ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడిపేసుకుని ఊళ్ల వెంట తిరుగుతున్నావు”అని మండిపడ్డారు.