
- ప్రారంభంలో టెక్నికల్ సమస్యలు వచ్చినా క్రమంగా స్పీడప్
- ఈ నెలాఖరు వరకు పంపిణీకి సివిల్ సప్లయిస్ శాఖ ఏర్పాట్లు
- ఒకేసారి పెద్ద ఎత్తున సన్న బియ్యం రావడంతో లబ్ధిదారుల్లో హర్షం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల ప్రారంభం నుంచి సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 62 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తయింది. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జూన్, జులై, ఆగస్టు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డులున్న కుటుంబాలకు సివిల్ సప్లయిస్ శాఖ రేషన్ పంపిణీ చేపట్టింది. ఈ నెలాఖరు వరకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి సివిల్ సప్లయిస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు పదేండ్లుగాపెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
56.40 లక్షల కార్డుదారులకు అందిన రేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17, 349 రేషన్ షాపుల ద్వారా ఈ నెల ప్రారంభం నుంచి రేషన్ పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డుల్లో 56.40 లక్షల కార్డుదారులకు 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇప్పటికే చేతికి అందింది. అంటే గత 13 రోజుల్లోనే 62 శాతం మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో 1.81 కోట్ల ట్రాన్సాక్షన్ నిర్వహించి, లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసినట్లు సివిల్ సప్లయిస్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు 3 నెలల రేషన్ పంపిణీ కోసం దాదాపు 5.58 లక్షల టన్నుల సన్నబియ్యం అవవరమవుతాయని సివిల్ సప్లయిస్ అధికారులు అంచనా వేసి, సిద్ధం చేశారు.
రేషన్ షాపుల్లో రోజుకు 15 లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా రేషన్ షాపుల్లో 100 శాతం రేషన్ పంపిణీ పూర్తయిందని అధికారుల పేర్కొంటున్నారు. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లబ్ధిదారులకు రేషన్ ఇస్తున్నారు. దీంతో ఆయా రేషన్‌షాపుల పరిధిలోని కార్డులకు రేషన్ పంపిణీ పూర్తయినా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ కొనసాగుతున్నది. ఒకేసారి సన్న బియ్యం పెద్ద ఎత్తున ఇంటికి చేరుతుండడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
టెక్నికల్ సమస్యలు అధిగమించి..
రేషన్ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పీఓఎస్) మెషీన్లో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో రేషన్ పంపిణీ చేపట్టగా కొత్త సాఫ్ట్వేర్ లో టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు వచ్చాయి. అయితే, వాటిని పరిష్కరించడంతో సమస్య తీరింది. రాష్ట్రంలో ఉన్న 91.83 లక్షల రేషన్ కార్డుల్లో 55 లక్షల వరకు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉండగా 36 లక్షలకు పైగా స్టేట్ కార్డులున్నాయి.
స్టేట్ కార్డులకు ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోలు ఇస్తుండగా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు మాత్రమే ఇస్తున్నది. వీరికి రాష్ట్రం తరఫున మరో కిలో కలిపి ఇస్తున్నారు. దీంతో ప్రతి నెలా సెంట్రల్ కార్డులున్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండు సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్‌ను ఒకేసారి ఇస్తుండడంతో ఒక్కో నెలకు రెండుసార్ల చొప్పున 3 నెలల రేషన్‌కు ఆరు సార్లు వేలిముద్రలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సెంట్రల్ కార్డులకు 6 సార్లు బయోమెట్రిక్ తీసుకునే విధానాన్ని సరళీకరించి మూడింటికే పరిమితం చేశారు. దీంతో రేషన్ పంపిణీ మరింత స్పీడప్ అయింది.