మ్యాట్రిమోనిలో పరిచయమైన ఓ కిలాడి వృద్ధుడిని నిండా ముంచింది. వలపు వలతో మాయమాటలు చెప్పి నమ్మించింది. ఇంకేముంది తానా అంటే తందాన అన్నాడు. వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా 60 లక్షలు కాజేసింది. భార్య చనిపోయి ఓంటరిగా ఉన్న 65 ఏళ్ల వృద్ధుడు రెండో పెళ్లి కోసం మ్యాట్రిమోని వెబ్ సైట్లో రిజిస్ట్రర్ అయ్యాడు. ఓ మహిళ పరిచయం అయ్యింది. ఇంకేముంది ఒకరి నంబర్ ఒకరు తీసుకున్నరు. చాటింగ్ చేసుకున్నరు. అలా అలా ఆ చాటింగ్ కాస్త వీడియో కాల్ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సన్నిహిత్యం హద్దులు దాటింది. వీడియో కాల్ లో న్యూడ్ గా మాట్లాడుకున్నారు. అయితే ఈ తతంగాన్ని మొత్తం ఆ మహిళ రికార్డ్ చేసింది. ఆ మహిళ తెలివిగా తన న్యూడ్ వీడియో రికార్డ్ చేయకుండా కేవలం వృద్ధుడి వీడియోను మాత్రమే రికార్డ్ చేసింది. తర్వాత అసలు కథ మొదలైంది.
డబ్బులివ్వమని ఆ మహిళ వృద్దుడిని డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో ఆ వృద్ధుడు కొంత డబ్బును ఆమె అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే అంతటితో ఆగని ఆ లేడి మరింత డబ్బును డిమాండ్ చేసింది. ఇలా రెండు మూడు నెలల్లో వృద్ధుడు ఆ మహిళకు ఏకంగా 60 లక్షల వరకు సమర్పించుకున్నాడు. అయినా ఆ మహిళ వేధింపులు తట్టుకోలేక, ఆర్థికంగా నష్టపోయిన ఆ వృద్ధుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళ వాట్సాప్ నంబర్ తో పాటు మనీ ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంట్ డీటేయిల్స్ ను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
