బేబీ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి

 బేబీ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం..   ఏడుగురు నవజాత శిశువులు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీలో వివేక్ విహార్ లోని బేబీ కేర్ సెంటర్  లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు మరణించినట్లు అధికారులు తెలిపారు. 2024 మే 25  రాత్రి 11.32 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.  

భవనం నుండి 12 మంది నవజాత శిశువులను రక్షించారని, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారని, మరో ఐదుగురు చిన్నారులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని  అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మరో ఘటనలో, ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఐదు అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని 13 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించాయి.  అటు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన  భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు సహా ఇరవై ఏడు మంది మరణించారు .