కేరళ పానూరు సమీపంలో శనివారం ( ఏప్రిల్ 6) ఏడు స్టీల్ బాంబులను పోలీసులు గుర్తించారు. అయితే ఇదే ప్రాంతానికి సమీపంలో శుక్రవారం ( ఏప్రిల్ 5)న బాంబు పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా .. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. బాంబు పేలుడు ఘటనపై కూతుపరంబ ఏసీపీ కే. వేణు గోపాల్ టీం విచారణ జరుపుతుంది. ఈ ఘటనలో షెరిన్ మరణించగా...అరుణ్, అతుల్, శిబిన్ లాల్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో సంబంధం ఉన్న నయూజ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ఓ ఇంటి టెర్రస్ పై కొంతమంది బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన షెరిన్సీపీఎం కార్యకర్త అని పోలీసులు తెలిపారు. రెండు చేతులు కోల్పోయిన వినీష్ పరిస్థితి విషమంగా ఉండటంతో కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు అశ్వంత్, వినోద్ లకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితులపై పానూరు పోలీసులు ఐపీసీలోని పేలుడు పదార్దాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు అధికార సీపీఐ (ఎం) కారణమని కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. వామపక్షాలు తమ కార్యకర్తలను ఉపయోగించి దేశంలోనే బాంబులు తయారు చేస్తున్నాయని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు.