మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

మద్యం దొరక్క  శానిటైజర్ తాగి ఏడుగురు మృతి


యావత్మల్: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో హ్యాండ్ శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు చనిపోయారు. కరోనా నిబంధనల మేరకు అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేశారు. ఈ క్రమంలో లిక్కర్ దొరక్కపోవడంతో శానిటైజర్ కొనుక్కుని తాగి శుక్రవారం రాత్రి చనిపోయారని పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. మృతులంతా కూలీలేనని, మూడు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించామని చెప్పారు. మిగతా నలుగురి మృతదేహాలకు బంధువులు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు చేశారని పోలీస్ ఆఫీసర్ అంజయ్ పూజల్వార్ చెప్పారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్యాప్తు  చేపట్టామన్నారు.  శానిటైజర్​లో 70 శాతం మద్యం ఉంటుందని ఎవరో సమాచారం ఇచ్చారని లాయర్ దీపక్ ఆరోపించారు. దీంతో వారంతా ఐదు లీటర్ల శానిటైజర్ కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారని, ఆ తర్వాత కడుపులో నొప్పితో ఆస్పత్రిలో చేరారని చెప్పారు. హెల్త్ కండిషన్ సీరియస్ కావడంతో ఒక్కొక్కరుగా చనిపోయారని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ఆంక్షలు విధించింది.