వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డ్.. 13 రోజుల్లో 10 కోట్ల టీకాలు

వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డ్.. 13 రోజుల్లో 10 కోట్ల టీకాలు

న్యూఢిల్లీ:వ్యాక్సినేషన్ లో మన దేశం మరో రికార్డు సాధించింది. 70 కోట్ల మార్కును దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 కోట్లకు పైగా టీకా డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. గత 13 రోజుల్లోనే 10 కోట్ల డోసులను వేసినట్లు తెలిపింది. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేశాం. ఇప్పటి వరకు 70 కోట్ల టీకా డోసులు వేశాం. ఈ విజయం సాధించినందుకు హెల్త్ వర్కర్లు, ప్రజలందరికీ అభినందనలు” అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. కరోనాను ఓడించాలని, దానిపై విజయానికి వ్యాక్సినేషనే మార్గమని చెప్పారు. మన దేశంలో ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. మొదటి 85 రోజులకు 10 కోట్ల మార్కును చేరుకుంది. 

తగ్గిన యాక్టివ్ కేసులు.. 

దేశంలో కొత్తగా 31,222 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.30 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ తో మరో 290 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,042కు పెరిగిందని తెలిపింది. గత 24 గంటల్లో 12,010 యాక్టివ్ కేసులు తగ్గాయని, ప్రస్తుతం 3,92,864 కేసులు ఉన్నాయని చెప్పింది. సోమవారం 15,26,056 టెస్టులు చేశామని, దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 53.31 కోట్లకు చేరిందని పేర్కొంది. డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.56 శాతంగా, రికవరీ రేటు 97.48 శాతంగా, డెత్ రేటు 1.33 శాతంగా నమోదైందని వివరించింది. ఇప్పటి వరకు 3.22 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పింది. గడిచిన 24 గంటల్లో నమోదైన మరణాల్లో కేరళలో 135, మహారాష్ట్రలో 37 ఉన్నాయంది. కాగా, గడిచిన 24 గంటల్లో 1.13 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్ర ప్రభుత్వం 
వెల్లడించింది.