- నిరుడు రూ.300 కోట్లతో కొత్తగా 100 చోట్ల నిర్మాణం
- 9 నెలల్లోనే 70 ప్రాంతాల్లో పూర్తి
- మిగిలిన 30 చోట్ల జూన్ కల్లా పూర్తిచేస్తామన్న సీఎండీ
- కరెంట్సమస్యలకు క్రమంగా చెక్
హైదరాబాద్, వెలుగు: పవర్ లోడ్ తగ్గించి, కోతలకు చెక్ పెట్టేందుకు సౌత్ డిస్కమ్ పరిధిలో కొత్తగా నిర్మించిన 70 విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తయ్యాయి. వీటిని త్వరలో ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుడు రూ.300 కోట్ల బడ్జెట్తో సౌత్ డిస్కమ్ పరిధిలోని పలు జిల్లాల్లో వంద 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
9 నెలల్లోనే 70 చోట్ల పనులు పూర్తికాగా, మరో 30 చోట్ల కూడా జూన్ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఏటా పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి చివరి వారంలో 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డయింది. ఇందులో దక్షిణ డిస్కమ్ పరిధిలోనే 11,129 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది.
ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్లో 4,421 మెగావాట్లకు చేరుకున్నది. భవిష్యత్ విద్యుత్ డిమాండ్ అవసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుడు కొత్తగా వంద విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనుల కోసం రూ.300 కోట్లు కేటాయించింది.
సిద్దిపేట జిల్లాలో 11 సబ్ స్టేషన్లు రెడీ
దక్షిణ డిస్కమ్ పరిధిలో కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్లలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా11 సబ్ స్టేషన్ పనులు పూర్తయ్యాయని ఇంజినీర్లు ప్రకటించారు. తర్వాత నల్గొండ జిల్లాలో 9, జోగుళాంబ గద్వాల జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7 చొప్పున, మెదక్, వనపర్తి జిల్లాలో 6 చొప్పున, మహబూబ్నగర్ జిల్లాలో 5, సూర్యాపేట, నాగర్కర్నూల్జిల్లాలో 3 చొప్పున, నారాయణ ఖేడ్, వికారాబాద్జిల్లాలో 2 చొప్పున, యాదాద్రి జిల్లాలో ఒక సబ్స్టేషన్ పనులు పూర్తి అయ్యాయని డిస్కమ్ ఇంజినీర్లు వివరించారు. వీటి నిర్మాణం కోసం రూ.217.25 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
సబ్ స్టేషన్లు ప్రారంభమైతే తగ్గనున్న విద్యుత్ సమస్యలు
దక్షిణ డిస్కమ్ పరిధిలో 1.20 కోట్ల వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగం ఎక్కువగా జరిగే హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు ఈ డిస్కమ్ పరిధిలోనే ఎక్కువ. డిస్కమ్ పరిధిలో మొత్తం 16 వేలకు పైగా హెచ్టీ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.2 వేల నుంచి రూ.2,500 కోట్ల వరకు కరెంట్ బిల్లులు వసూలు అవుతాయి.
కొత్తగా చేపట్టిన విద్యుత్ సబ్ స్టేషన్లలో పనులు పూర్తయిన 70 సబ్స్టేషన్లను ప్రభుత్వం ప్రారంభిస్తే ఈ నెల, రాబోయే ఖరీఫ్ సీజన్లో విద్యుత్ సమస్యలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరగడంతో కరెంట్ లోడ్ఎక్కువై ఈ డిస్కం పరిధిలో గడిచిన నెల రోజుల్లో సుమారు 600కు పైగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయి. కొత్త సబ్స్టేషన్ల రాకతో లోడ్ సమస్యలు తగ్గిపోతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.
