- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్,వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత తనదేనని, నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్ పేమెంట్లు త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 డేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ భవనం, మహిళలు-పురుషులకు వేర్వేరు హాస్టళ్లు, తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, వంగరలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఎల్లమ్మ చెరువు, అర్బన్ ఫారెస్ట్, కొత్త, పల్లె చెరువుల సుందరీకరణతో హుస్నాబాద్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అంతకుముందు పాటిమీది హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ జాతరపై మున్సిపల్ ఆఫీస్‌లో అధికారులతో రివ్యూ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.హైమావతి, సీపీ సాధన రష్మీ పెరుమాళ్, ఏసీపీ సదానందం, ఆర్డీవో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సిబ్బందిని వేధించొద్దు
ఆర్టీసీ సిబ్బందిని వేధించొద్దని, ప్రేమగా పనిచేయించుకోవాలని మంత్రి పొన్నం ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మే 17లోపు అన్ని డిపోలు, బస్టాండ్లలో టాయిలెట్లు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు వంటి డిపోలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయో ఆర్ఎంలు, డీఎంలు సమీక్షించుకోవాలి అన్నారు.
