అన్నదాతకు అప్పుపుట్టట్లే..

అన్నదాతకు అప్పుపుట్టట్లే..
  • రాష్ట్రం లో 70 శాతం రైతులకుఅందని పంట రుణాలు
  • రుణ లక్ష్యం రూ.29,244 కోట్లు ..ఇచ్చిం ది 10,581 కోట్లే
  • రాష్ట్రం లో రైతులు 56.75 లక్షలు
  • రుణం అందుకున్నవారు 11.77 లక్షల మందే

రాష్ట్రంలో జోరు వర్షాలు రైతుల్లో ఆనందం నింపుతున్నా.. పంట వేసేందుకు వారికి అప్పు మాత్రం పుట్టడం లేదు. రుణ లక్ష్యాలు భారీగా ఉన్నా బ్యాంకులు మాత్రం అంతంత మాత్రంగానే అప్పులు ఇస్తున్నాయి. దీంతో 80 శాతానికిపైగా రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మిత్తికి పైసలు తీసుకోవాల్సి వస్తోంది. 2018 డిసెంబర్​ 11 లోపు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలనూ విడుదల చేయలేదు. బడ్జెట్‌‌లో రుణమాఫీ కోసం రూ.6,000 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు నిధులు రిలీజ్​కాలేదు. దీంతో 45 లక్షల మంది రైతులు రుణాల కోసం గోసపడుతున్నారు.

30 శాతం మందికే రుణాలు

జులై 31 నాటికి 30%  మంది రైతులకే బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్రంలో 56.75 లక్షల మందికిపైగా రైతులు ఉండగా.. ఇప్పటికి  11.77 లక్షల మందికే రుణాలు అందినట్లు స్టేట్‌‌ లెవల్‌‌ బ్యాంకర్స్‌‌ కమిటీ గణాంకాలు చెబుతున్నాయి. రుణ లక్ష్యం రూ.29,244 కోట్లు కాగా,
ఇచ్చింది 10,581 కోట్లే. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు కొత్త రుణాలు పొందలేకపోతున్నారు. రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులకు పాత బాకీ చెల్లిస్తేనే కొత్త అప్పు ఇస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారు. పాత బాకీ కట్టలేక కొత్త రుణాలు రాక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. చేసేది లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి పైసలు తీసుకుంటున్నారు. మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదల చేసినా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.