కెనడాలో రోడ్డెక్కిన మనోళ్లు.. ఫేక్ డాక్యుమెంట్లతో వచ్చారంటూ ఆరోపణ

కెనడాలో రోడ్డెక్కిన మనోళ్లు.. ఫేక్ డాక్యుమెంట్లతో వచ్చారంటూ ఆరోపణ
  •     700 మంది ఇండియన్ స్టూడెంట్లకు నోటీసులు 
  •     తిరిగి వెళ్లిపోవాలని ఆదేశం
  •     వారం నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులు 

ఒట్టావా: కెనడాలో చదువుకునేందుకు వెళ్లిన మనోళ్లు రోడ్డెక్కారు. అక్కడి సర్కార్ తీరును నిరసిస్తూ వందలాది మంది స్టూడెంట్లు ఆందోళనలు చేస్తున్నారు. ఫేక్ ఆఫర్ లెటర్లతో యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్లు పొందారంటూ 700 మంది ఇండియన్ స్టూడెంట్లకు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీఎస్ఏ) డిపోర్టేషన్ నోటీసులు ఇచ్చింది. వాళ్లంతా ఫేక్ డాక్యుమెంట్లతో అక్రమంగా దేశంలోకి వచ్చారని, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. పోయిన నెల 29 నుంచి అంటారియో సిటీ మిస్సిసాగాలోని సీబీఎస్ఏ హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన తెలుపుతున్నారు. తమకేం తెలియదని, ట్రావెల్ ఏజెంట్లు మోసం చేశారంటూ విద్యార్థులు వాపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్ కు చెందినోళ్లు ఉన్నారు. సీబీఎస్ఏ ఇచ్చిన డిపోర్టేషన్ లెటర్లపై కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ సీన్ ఫ్రేజర్​ను కూడా కలిశామని విద్యార్థులు చెప్పారు. ‘‘నన్ను పంపించిన ఏజెంట్ మొదట నాకు అడ్మిషన్ వచ్చిన కాలేజీకి వెళ్లొద్దన్నాడు. ఆ తర్వాత అడ్మిషన్ వేరే కాలేజీకి మార్చామని తెలిపాడు. అనంతరం నా ఇమిగ్రేషన్ పేపర్లు ఫోర్జరీ అయినట్లు నాకు తెలిసింది. చాలామంది ఏజెంట్లు ఇలాగే మోసం చేస్తున్నారు”అని పంజాబ్​కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశాడు. 

కేంద్రం స్పందించాలి: కుల్దీప్ సింగ్ 

కెనడాలో 700 మంది స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని పంజాబ్ ఎన్ఆఐ అఫైర్స్ మినిస్టర్ కుల్దీప్ సింగ్ ధాలివాల్ కోరారు. ‘‘స్టూడెంట్లను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్లను కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంమంత్రిని కోరాను. స్టూడెంట్ల సమస్యపై మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ అడిగాను. మంత్రి జైశంకర్​కు కూడా లెటర్ రాశాను’’ అని ఆయన తెలిపారు. కాగా, ఇండియన్ స్టూడెంట్ల డిపోర్టేషన్​ను ఆపాలని కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బ్రాడ్ పార్లమెంటరీ కమిటీని కోరారు. ఈ అంశంపై ముందుగా విచారణ జరిపించాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే అది వాయిదా పడింది.