
హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం ₹75 కోట్లు విడుదల చేసింది. శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్కు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఈ నిధులను వాడతామని ఆమె చెప్పారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి పైసాను సద్వినియోగం చేయాలని, వృథా ఖర్చులను నివారించాలని సూచించారు. జాతర ఏర్పాట్లపై త్వరలోనే అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. శాఖల వారీగా కేటాయించే నిధులు, వాటిని ఖర్చు చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తక్కువ టైం ఉందని చెప్పి పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె సూచించారు. ఫిబ్రవరిలో మేడారం జాతర జరుగుతుందన్న సంగతి తెలిసిందే.