చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది ప్రైవేట్ బస్సు. ఈ ఘటనలో.. 8 మంది చనిపోయారు. మొత్తం 63 మంది ప్రయాణికుల్లో 45 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్పాట్ లోనే ఏడుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరుపతిలో నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి వెళ్తుండగా.. ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడింది. 

అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్ కు చెందిన వేణుకు... చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇవాళ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో వేణు కుటుంబం ధర్మవరం నుంచి నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరారు. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అంతా భోజనం చేశారు. తర్వాత.. భాకరాపేట ఘాట్ లో వస్తుండగా గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపు దగ్గర బస్సు అదుపు తప్పి కుడివైపున లోయలో పడిపోయింది.

బస్సు లోయలో పడ్డ చాలా సేపటికి.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించారు. చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు ప్రత్యేక బృందాలు, ఫైర్ సిబ్బంది సహాయంతో చాలాసేపు శ్రమించి అందరినీ బయటకు తీశారు. కలెక్టర్  హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చిమ్మ చీకటిలో అటవీ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి... గాయపడ్డ వారిని సకాలంలో హాస్పిటల్ కు తరలించి చాలామంది ప్రాణాలను కాపాడారు. ఘటనపై సంతాపం తెలిపిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున  ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.