కరోనాతో చనిపోయిన వారి  అంత్యక్రియలకు రూ.8 వేలు

కరోనాతో చనిపోయిన వారి  అంత్యక్రియలకు రూ.8 వేలు


హైదరాబాద్,వెలుగు: శ్మశాన వాటికల్లో వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు  స్పందించారు. గతేడాది ఫస్ట్​ వేవ్​లో  కరోనాతో చనిపోయిన  వారి అంత్యక్రియల బాధ్యతలను బల్దియా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని నిర్వహించింది. కానీ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ విషయంపై అసలు స్పందించలేదు. దీంతో శ్మశాన వాటికల్లో ఎవరి ఇష్టానుసారంగా వారు వసూలు చేస్తున్నారు. రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు. కొవిడ్ డెడ్ బాడీ అయితే అంబులెన్స్​తో కలిపి అంత్యక్రియలకు​మొత్తం రూ.50 నుంచి 60 వేల వరకు తీసుకుంటున్నారు. ఈ దందా గత రెండు నెలల నుంచి ఇంకా పెరిగింది. ఈ వసూళ్లపై సోషల్ మీడియాలో ద్వారా రావడంతో శ్మశాన వాటికల్లో వసూళ్లపై  బల్దియా అధికారులు అలర్ట్ అయ్యారు. శనివారం  బల్దియా  కమిషనర్, జోనల్ కమిషనర్లు,డిప్యూటీ కమిషనర్ల తో  మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ కాన్ఫరెన్స్​ కాల్ లో మాట్లాడారు. ఏ శ్మశాన వాటికలోనూ అంత్యక్రియలకు ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత బల్దియాపైనే ఉందన్నారు. దీంతో శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్నిచోట్లా ఒకే రేటు ఉండేలా బల్దియా అధికారులు నిర్ణయించారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.8 వేలు, నాన్ కొవిడ్ అయితే రూ.6 వేలుగా నిర్ణయించారు. కరోనా డెడ్ బాడీని ఎలక్ట్రిక్ మెషీన్ పై దహనం చేస్తే రూ.4 వేలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. అన్ని శ్మశాన వాటికల్లో ఈ రేట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.