
- 8 వేల మంది పోలీసులు.. 600 సీసీ కెమెరాలు
- పీఎం టూర్‌కు ప్రత్యేక నిఘా
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 వేల మంది పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, కేంద్ర బలగాలతో నిఘా పెట్టారు. ఇక్రిశాట్, శ్రీరామనగరం చుట్టూ డ్రోన్లు, పారాగ్లైడర్లపై నిషేధం విధించారు. ప్రధాని స్పెషల్ సెక్యూరిటీతో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ కో ఆర్డినేట్ చేసుకుంటూనే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాల్లోకి అనుమతించారు. సెక్యూరిటీ బాధ్యతలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షించారు.
ఎస్‌పీజీ అధీనంలో ముచ్చింతల్, ఇక్రిశాట్
శుక్రవారం ఉదయం నుంచే ఇక్రిశాట్, ముచ్చింతల్ శ్రీరామనగరం ప్రాంతాలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) తమ అధీనంలోకి తీసుకుంది. ముచ్చింతల్ శ్రీరామనగరం పరిసర ప్రాంతాల్లో 600లకు పైగా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ముచ్చింతల్, పటాన్‌చెరులోని ఇక్రిశాట్ దారుల్లో పోలీసులను మోహరించారు. పీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. సమతామూర్తి కేంద్రానికి సమీపంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ 5 కిలోమీటర్ల వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.