ఓవర్ డోస్ ఇంజెక్షన్ వల్లే బాలుడి మృతి..!

ఓవర్ డోస్ ఇంజెక్షన్ వల్లే బాలుడి మృతి..!

   డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు

జ్వరంతో హాస్పిటల్ లో చేరిన ఎనిమిదేళ్ల బాలుడు ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోగా..దీనికి డాక్టర్ల నిర్లక్ష్యం కారణమంటూ ఆరోపించారు. ఆ హాస్పిటల్ ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు.  ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..రహమత్ నగర్ లో ఉంటున్న  రాధ, లింగం దంపతుల కుమారుడు విఘ్నేశ్​(8) సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. విఘ్నేశ్ కి ఈ నెల 7 శనివారం  జర్వం రావడంతో రాధ, లింగం దంపతులు తమ కుమారుడిని  పంజాగుట్టలోని ప్రజ్ఞ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.  పరీక్షల అనంతరం ఆ బాలుడికి  డెంగ్యూ ఉన్నట్లు ఆదివారం డాక్టర్లు నిర్దారించారు. మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తామని చెప్పిన ప్రజ్ఞ హాస్పిటల్ యాజమాన్యం  విఘ్నేశ్ ని అడ్మిట్ చేసుకుంది. కానీ మంగళవారం ఉదయం 8 గంటలకు విఘ్నేశ్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రజ్ఞ హాస్పిటల్ యాజమాన్యం గురువారం పోలీసుల సమక్షంలో విఘ్నేశ్​డెడ్ బాడీని అప్పగించే ప్రయత్నం చేశారని బంధువులు చెప్పారు.

ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే విఘ్నేశ్​ చనిపోయినట్టు వారు ఆరోపించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం విఘ్నేశ్ డెడ్ బాడీని తమకు అప్పగించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడి డెడ్ బాడీతో రాధ,లింగం దంపతులు, బంధువులు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశామని..చనిపోయిన బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఇన్ స్పెక్టర్  హామీ ఇచ్చారు.  అనంతరం బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు.