వానాకాలం సాగు 84 లక్షల ఎకరాలు

వానాకాలం సాగు 84 లక్షల ఎకరాలు
  •  కోటి ఎకరాలు దాటుతుందన్న వ్యవసాయ శాఖ
  • ప్రభుత్వానికి నివేదిక అందజేత
  • 26 లక్షల ఎకరాల్లో వరి నాట్లు
  • అత్యధికంగా 41లక్షల ఎకరాల్లో పత్తి సాగు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగు కోటి ఎకరాలకు దగ్గరవుతున్నది. ఇప్పటిదాకా 84.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాలు పంటలు సాగయ్యాయి. 32 జిల్లాల్లో 65.42 శాతం పంటల సాగు నమోదైనట్టు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపింది. వానా కాలంలో సాధారణ పంటల సాగు 1.29 కోట్ల ఎకరాలు కాగా, నిరుడు 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి 1.31 కోట్ల ఎకరాల్లో పంట సాగు కావాలని వ్యవసాయ శాఖ టార్గెట్ పెట్టుకున్నది. పత్తి 66 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 41.65 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి 60 లక్షల ఎకరాల సాగు టార్గెట్ కాగా.. దాదాపు 44.74 శాతం నాట్లు వేశారు.

సాగులో నల్గొండ జిల్లా టాప్

పంటల సాగులో నల్గొండ జిల్లా టాప్​లో ఉంది. నల్గొండ సాధారణ సాగు 11.07 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటిదాకా అత్యధికంగా 6.12 లక్షల ఎకరాల్లో (55.35%) పంటలు సాగయ్యాయి. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 5.76 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 5.63 లక్షల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 5.02 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 4.39 లక్షల ఎకరాల్లో, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3.81 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.64 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 3.59 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.48 లక్షల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3.27 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 3.24 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. నారాయణపేట జిల్లాలో 3 లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2.61 లక్షల ఎకరాలు, నాగర్ కర్నూల్​జిల్లాలో 2.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో వివరించింది. అయితే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాత్రం కేవలం 9,596 ఎకరాల్లోనే పంటలు సాగవడం గమనార్హం.

నిజామాబాద్​లో అత్యధికంగా వరి సాగు

వరి వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా.. ఈ యేడు 60 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా, ఇప్పటి దాకా 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సాధారణ సాగులో 44.74 శాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. పెద్దపల్లిలో 1.92 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.79 లక్షల ఎకరాలు, కరీంనగర్​లో 1.66 లక్షల ఎకరాలు, సిద్ధిపేటలో 1.52 లక్షల ఎకరాలు, యాదాద్రిలో 1.50 లక్షల ఎకరాలు, మెదక్​లో 1.22లక్షల ఎకరాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మిలెట్ల సాగుపై ఆసక్తి చూపని రైతులు

రాష్ట్రంలో పత్తి పంటనే రైతులు ఎక్కువగా సాగు చేశారు. 41.65 (82.50%) లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. మక్క సాధారణ సాగు విస్తీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటిదాకా 4.07 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 4.98 లక్షల ఎకరాల్లో (58.51%) సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా కంది పంట 7.11 లక్షల ఎకరాల సాధారణ సాగు కాగా.. ఇప్పటి వరకు 4.17 లక్షల ఎకరాల్లో సాగైంది. పెసర్లు సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు కాగా, ఈ యేడు ఇప్పటి దాకా 61,580 ఎకరాల్లో (60.53%) వేశారు.

 మిల్లెట్స్‌‌‌‌‌‌‌‌ సాగుపై దృష్టి సారించాలని సర్కారు చెప్తున్నా.. రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. జొన్న ఈ యేడు 31,828 ఎకరాల్లో సాగైంది. సజ్జ ఇప్పటి దాకా కేవలం 274 ఎకరాల్లోనే వేశారు. రాగులు కేవలం 173 ఎకరాల్లోనే సాగైంది. మేజర్ మిల్లెట్స్ కొంత ఫర్వాలేదనిపించినా మైనర్ మిల్లెట్లు కొర్రలు, సామలు, అరికెలులాంటివన్నీ కలిపి 395 ఎకరాల్లో సాగైనట్టు వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొన్నది.