ఆన్ లైన్ రొమాన్స్ స్కాం : ఇండోనేషియాలో 88 మంది చైనా యూత్ అరెస్ట్

ఆన్ లైన్ రొమాన్స్ స్కాం : ఇండోనేషియాలో 88 మంది చైనా యూత్ అరెస్ట్

ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ రొమాన్స్, పెట్టుబడుల పేరుతో మోసాలు, ఆన్ లైన్ జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకాలాపాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇండోనేషియాలో ఓ భారీ ఆన్ లైన్ రొమాన్స్ స్కాం బయటపడింది.  చైనా, ఇండియోనేషియా సరిహద్దుల్లో ఆన్ లైన్ రొమాన్స్ మోసాలకు పాల్పడుతున్న 88మంది చైనా పౌరులను ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేశారు. 

చైనీస్ భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందుకున్న ఇండోనేషియా పోలీసులు ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్ సిండికేట్‌లో ప్రమేయం ఉన్న ఐదుగురు మహిళలతో సహా 88 మంది చైనా పౌరులను  బాటమ్ ద్వీపంలో అరెస్ట్ చేసినట్లు  రియావు దీవుల పోలీస్ అధికారులు తెలిపారు.  

స్కామర్‌లు  ఇతర వ్యక్తుల ఫొటోలతో  ఫోనీ ప్రొఫైల్‌ను సృష్టించి టార్గెట్ చేసిన వ్యక్తులతో మాట్లాడుతారు. క్రమంగా వారిని నమ్మించి వారిని ఇష్టపడేలా చేస్తారు. ఆ వ్యక్తి నమ్మిన తర్వాత చికిత్స కోసం డబ్బులు లేదా  అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామంటూ డబ్బులు వసూలు చేస్తుంటారు.

ఆన్ లైన్ రొమాన్స్ సంబంధింత మోసాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. స్కామర్‌లు సోషల్ మీడియా లేదా డేటింగ్ సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో బాధితులను లక్ష్యంగా చేసుకుంటారు. ఆన్ లైన్ ఇతర మోసాలకంటే రొమాన్స్ సంబంధిత మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని  US ఫెడరల్ ట్రేడ్ కమీషన్ ఇటీవల ప్రకటించింది.

క్రిమినల్స్ ఆగ్నేయాసియాలోని వందల వేల మందిని శృంగారం, ఆన్ లైన్ పెట్టుబడులు, జూదం పేరుతో చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ స్కామ్ లలో పాల్గొనేలా బలవంతం చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ బుధవారం తెలిపారు.  మయన్మార్‌లో కనీసం లక్షా 20 వేల మంది, కంబోడియాలో దాదాపు లక్షమంది  ఆన్‌లైన్ స్కామ్‌ల బాదితులు న్నారని తెలిపింది.  

లావోస్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ లలో చాలా మంది కార్మికులు ఆన్ లైన్ బానిసత్వంలో చిక్కుకుని సైబర్ క్రైమ్ స్కామ్‌లలో పాల్గొంటున్నారని ఇది ఆసియాలో ఆందోళనకరమైన విషయమని అన్నారు. 

2017లో టెలిఫోన్ మోసం , ఆన్‌లైన్ పెట్టుబడి స్కామ్ సిండికేట్‌లో పాల్గొన్న 419 మంది చైనీస్ , తైవాన్ పౌరులను ఇండోనేషియా అరెస్టు చేసింది. రెండు నెలలు ఇండోనేషియా జైళ్లలో గడిపిన తర్వాత  వారిని స్వదేశానికి పంపించారు. 2019లో ఇండోనేషియా పోలీసులు ఇదే కేసులో 85 మంది చైనా పౌరులను అరెస్టు చేశారు.