సిరియా డ్రోన్ దాడి ఘటనలో మృతులు 89 మంది

సిరియా డ్రోన్ దాడి ఘటనలో మృతులు 89 మంది
  • ఆస్పత్రులకు బంధువుల క్యూ
  • మృతుల అంత్యక్రియలు పూర్తి 
  • దాడిలో 277 మందికి గాయాలు

హోమ్స్(సిరియా): సిరియాలో మిలటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో చనిపోయినోళ్ల డెడ్ బాడీల కోసం బంధువులు ఆస్పత్రుల ముందు బారులుతీరారు. హోమ్స్ ప్రావిన్స్ లోని మిలటరీ హాస్పిటల్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ 30 మంది డెడ్ బాడీలను ఉంచగా, శుక్రవారం అంబులెన్స్ లలో సొంతూళ్లకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

హోమ్స్ సిటీలోని మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా గురువారం డ్రోన్ దాడి జరిగింది. ఇందులో ఆర్మీ లెఫ్టినెంట్ ఇబ్రహీం షాబాన్ కు కాబోయే భార్య రనీమ్ ఖుబా చనిపోయింది. ఆమె తమ్ముడు హుసేన్ ఖుబా ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకోగా, గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొనేందుకు తన తండ్రి, చెల్లెతో కలిసి రనీమ్ ఖుబా వచ్చారు. అయితే దాడిలో ముగ్గురూ చనిపోయారు. 

రనీమ్ ఖుబా డెడ్ బాడీ కోసం ఆస్పత్రికి వచ్చిన ఆర్మీ లెఫ్టినెంట్ ఇబ్రహీం షాబాన్... ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ‘నా వెన్నెముక విరిగిపోయినట్టుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల సంఖ్య పెరగొచ్చు..

డ్రోన్ దాడితో భారీ పేలుడు సంభవించి ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఈ దాడిలో 89 మంది చనిపోగా, 277 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. చనిపోయినోళ్లలో 31 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొంది.

టెర్రరిస్టులను విడిచిపెట్టం: ఆర్మీ  

ఈ దాడి తిరుగుబాటుదారుల పనేనని మిలటరీ ఆరోపించింది. అంతర్జాతీయ శక్తుల అండతో దాడికి పాల్పడ్డారని పేర్కొంది. టెర్రరిస్టులను 

విడిచిపెట్టబోమని హెచ్చరించింది.