
తల్లిదండ్రులారా పిల్లలతో తస్మాత్ జాగ్రత్త. భార్యభర్తల మధ్య అంతర్గత వ్యవహారాల్ని పిల్లల ఎదుట బహిర్గతం చేస్తే అవి వారిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. గతంలో తనని స్కూల్ కు పంపించడం లేదని ఓ బాలుడు , తనని ఆడుకోకుండా నానమ్మ అడ్డుకుంటుందని మరో బాలుడు పోలీసుల్ని ఆశ్రయించడం చర్చాంశనీయమైంది. ఆ ఘటనల్ని మరువకముందే తండ్రి తనని కొడుతున్నాడంటూ నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని వడ్డేపల్లికి చెందిన ఎనిమిదేళ్ల మహేష్ తన కన్నతండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి కొడుతున్నాంటూ పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో బాలుడి ఫిర్యాదుపై చలించిన పోలీసులు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉంటే రహస్యంగా చర్చించుకోవాలని సూచించారు. ఇరువురు గొడవపడుతూ పిల్లలపై ప్రతాపం చూపించడమేంటని ప్రశ్నించారు. ఇకపై పిల్లల్ని కొట్టొద్దని.. జాగ్రత్తగా చూసుకోవాలని మందలించారు. దాంతో సరేనంటూ తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.